నకిలీ పత్తి విత్తనాల కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ ఎస్సై వెంకటేశ్ అరెస్ట్ 

నకిలీ పత్తి విత్తనాల కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ ఎస్సై వెంకటేశ్ అరెస్ట్ 

మంచిర్యాల, వెలుగు : నకిలీ పత్తి విత్తనాల కేసులో కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా టాస్క్​ఫోర్స్​మాజీ ఎస్సై సెగ్యం వెంకటేశ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎస్సైగా పనిచేసి ఇటీవల సస్పెండ్​అయిన ఆయన ప్రస్తుతం ములుగు జిల్లాలో పనిచేస్తున్నారు. వెంకటేశ్​కొంతమంది నకిలీ పత్తి విత్తన విక్రయదారులతో కుమ్మక్కైనట్లు పోలీసులు గుర్తించారు.

కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ నితికాపంత్ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్ 11న ఆసిఫాబాద్ సమీపంలో నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న షేక్ సల్మాన్, ఆరె వేణుగోపాల్​రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా షేక్ సల్మాన్​2025 నుంచి నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్నానని, గతంలో ఓ కేసులో అప్పటి టాస్క్​ఫోర్స్ ఎస్సై వెంకటేశ్ తనను అదుపులోకి తీసుకున్న టైంలో అతడితో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించాడు. ఈ దందాకు సదరు ఎస్సై సహకరించారని, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరె వేణుగోపాల్​రెడ్డిని సైతం పరిచయం చేశారని చెప్పారు. 

ఇద్దరూ కలిసి 40 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సప్లై చేసినట్లు వెల్లడైంది. వీటిలో 35 క్వింటాళ్ల విత్తనాలను మధ్యవర్తులకు విక్రయించగా.. మిగిలిన ఐదు క్వింటాళ్లను నెన్నెల మండలంలోని ఒక పౌల్ట్రీ ఫారంలో దాచారు. ఆగస్టు 11న ఆ విత్తనాలను రవాణా చేస్తుండగా ఆసిఫాబాద్​లో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేక్ సల్మాన్ కు సంబంధించిన కాల్ డీటెయిల్స్ రికార్డు (సీడీఆర్​)లను పరిశీలించి ఎస్సై వెంకటేశ్ తో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో సోమవారం కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్​లోని తన నివాసంలో వెంకటేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్టు ఎస్సీ వివరించారు. కాగా, ఎస్సై వెంకటేశ్ గతంలో సిర్పూర్, కాగజ్​నగర్, బెజ్జూర్, తిర్యాణి పోలీస్​స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. నకిలీ పత్తి విత్తనాలు, పశువుల అక్రమ రవాణా, మట్కా దందాల్లో పెద్ద ఎత్తున వసూళ్లకు, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తిర్యాణి ఎస్సైగా ఉన్న సమయంలో సస్పెండ్​ అయ్యారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పనిచేస్తున్నారు.