- ఏసీబీ..నాపై ఆరోపణలను నిరూపించలే
- నాంపల్లి కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్
- ఈ నెల 30న డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు
- న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదింపులు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో సోమవారం డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తాను నిర్దోషినని, ఏసీబీ తనపై ఆరోపణలను నిరూపించలేకపోయినందున తన పేరును చార్జ్‌షీట్ నుంచి తొలగించాలని కోరారు. కేసు విచారణ అక్టోబర్ 30న ఉండడంతో అదే రోజు కోర్టు కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. ఈ మేరకు ఏసీబీకి నోటీసులు జారీ చేయనుంది. కేటీఆర్ పిటిషన్ పై ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై ఏసీబీ అధికారులు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఫార్మూలా ఈ కార్ రేస్ పేరిట గత ప్రభుత్వ హయాంలో రూ.55 కోట్ల మేర హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, బీఆర్‌ఎస్‌కు క్విడ్ ప్రో కో జరిగినట్లు ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ ఈ ఏడాది మార్చి 23న ఏసీబీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మే 14న కోర్టు విచారణకు స్వీకరించగా.. జూన్ 31న జరిగిన మొదటి విచారణలో కేటీఆర్ సహా ఏ2 మాజీ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్, ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధి గొవడ కిరణ్ మల్లేశ్వరరావు ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. రెండు వాయిదాల అనంతరం తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఈ క్రమంలోనే చార్జ్‌షీట్ నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయలేమని చెప్పిన సుప్రీంకోర్టు, హైకోర్టు
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కేటీఆర్ గతంలోనే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయలేమని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులకు సమన్లు జారీ అయిన తర్వాత ట్రయల్ ప్రారంభం కాకముందే కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడంపై ఏసీబీ న్యాయనిపుణలు సలహాలు తీసుకుంటోంది. డిశ్చార్జ్ పిటిషన్‌లో కేటీఆర్ లేవనెత్తిన కారణాలు, ఏసీబీ మోపిన అభియోగాలతో పాటు సాంకేతిక ఆధారాలను కోర్టు పరిగణలోకి తీసుకోనుంది.
