పారిస్: ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జీవన వ్యయాలు, దిగజారుతున్న ప్రభుత్వ సేవలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. పారిస్‌తో పాటు పలు నగరాల్లో కన్నీటి వాయువు మేఘాలు కమ్ముకున్నాయి. పలు భవనాల్లో మంటలు చెలరేగగా, దుకాణాలను నిరసనకారులు ధ్వంసం చేసి, వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఫ్రాన్స్ అంతటా సుమారు 5.5 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపారు. ఒక్క పారిస్‌లోనే 1.10 లక్షల మంది ఆందోళనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. అయితే, నిరసన నిర్వాహకులు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందన్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు 1,200 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఘర్షణల్లో 150 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు.
విద్యార్థుల ఆందోళనతో మొదలై.. దేశవ్యాప్త ఉద్యమంగా
పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడం, విద్యా సదుపాయాల కొరత వంటి సమస్యలపై విద్యార్థులు ప్రారంభించిన నిరసనలు క్రమంగా విస్తరించాయి. జీవన వ్యయాలు పెరగడం, ప్రజా సేవల నాణ్యత తగ్గడం, ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తితో కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఉద్యమంలో చేరాయి.
పారిస్‌లో ప్రధాన ర్యాలీ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగానే సాగింది. అయితే, సాయంత్రం సమీపించే కొద్దీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు వీధుల్లో నిప్పు పెట్టడంతో పాటు వాహనాలను తగులబెట్టారు. ప్రముఖ ప్రాంతమైన ప్లాస్ ద లా రిపబ్లిక్ సమీపంలోనూ వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు నిరసనకారులపైకి దూసుకెళ్లి లాఠీలతో కొడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
లూయీ విటాన్, యాపిల్ స్టోర్లపై దాడులు
హింసాత్మక ఘటనలతో పలు వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దుకాణాల్లో చొరబడిన నిరసనకారులు వస్తువులను దోచుకున్నారు. కొన్ని వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. కనీసం ఒక రెస్టారెంట్ మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.బోర్డో నగరంలో లూయీ విటాన్ దుకాణాన్ని నిరసనకారులు దోచుకోగా, లిల్లే నగరంలోని యాపిల్ స్టోర్పైనా దాడి జరిగింది. పారిస్‌లో దుస్తులు, ఆహార పదార్థాల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. లిల్లే, మార్సెయి నగరాల్లో ప్రభుత్వ భవనాల్లోకి కూడా నిరసనకారులు చొరబడినట్లు సమాచారం.
పలు ప్రాంతాల్లో మంటలు ఎగసిపడుతుండగా, నిరసనకారులు చారిత్రక విగ్రహాలపైకి ఎక్కిన దృశ్యాలు ఫొటోలు, వీడియోల్లో కనిపించాయి. పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ సేవలపై అసంతృప్తితో ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఫ్రాన్స్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
⚠️🔴 À REGARDER JUSQU'À LA FIN JE NE PEUX PAS DÉCRIRE CE QUE JE VIENS DE VIVRE À MARSEILLE. #17octobre https://t.co/F8bLimtd7y
— confrontation française (@confrontfr) October 17, 2026
