ఫ్రాన్స్ లో నిరసనలు హింసాత్మకం..దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..అత్యవసర పరిస్థితి దిశగా ప్రభుత్వం చర్యలు?

ఫ్రాన్స్ లో నిరసనలు హింసాత్మకం..దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..అత్యవసర పరిస్థితి దిశగా ప్రభుత్వం చర్యలు?

ఫ్రాన్స్‌లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెట్రోల్‌, డీజిల్‌, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో  గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు వారాంతంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. పారిస్​ తో పాటు పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు అల్లర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం, దోపిడీలకు దారితీయడంతో భద్రతా చర్యలను ఫ్రాన్స్ కట్టుదిట్టం చేస్తోంది. అల్లర్లను అదుపులో తెచ్చేందుకు కర్ఫ్యూ విధించాలని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకార్నో పోలీసులను సోమవారం తెలిపారు. అవసరమైతే ఎమర్జెన్సి విధిస్తామని ప్రకటించారు. 

ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయం (Cost of Living Crisis) ,విద్యావ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు ఉధృతమయ్యాయి. గత కొన్ని వారాలుగా కేవలం విద్యార్థులకే పరిమితమైన ఈ ఉద్యమంలోకి ప్రస్తుతం కార్మిక సంఘాలు, 'ఎల్లో వెస్ట్' నిరసన కారులు, సాధారణ ప్రజలు చేరడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేవలం ఒకే రోజున దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి8 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు.

పారిస్​ , మార్కెయిల్ , లియోన్​,లిమోజెస్ వంటి నగరాలు అల్లర్లతో అట్టుడికి పోయాయి.  ప్రజలు గుంపులుగా వచ్చి దుకాణాలను దోచుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలకు తగలబెట్టడం వంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం పారిస్​లో  దాదాపు 30  కమర్షియల్​ దుకాణాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఈ వారం రోజుల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఫ్రాన్స్​ వ్యాప్తంగా 2వేల దుకాణాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించారు. ఈ ఘర్షణల్లో దేశవ్యాప్తంగా 2వేల 500 మందిని అరెస్ట్ చేశారు. 

నిరసనల్లో అనేకమంది నిరసనకారులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. నిరసనకారులపైకి పోలీసులు గ్రేనేడ్లు విసరడంతో   తూర్పు ఫ్రాన్స్​ లో జరిగిన నిరసనల్లో 17 ఏళ్ల బాలిక కన్ను కోల్పోయింది. సెయింట్​ ఎటియన్​ లో యువకుడు చేయిని కోల్పోయాడు. 

హింస..లూటీలు..

గత వారం  సెంట్రల్ ఫ్రాన్స్‌లోని సుమారు 143 ఏళ్ల నాటి చారిత్రక  లిమోజెస్ టౌన్ హాల్ (Limoges City Hall) భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో దాని పైకప్పు, గోపురం కూలిపోయాయి. లియోన్ నగరంలోని పర్యాటక కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. పారిస్, లిల్లీ, మార్సియెల్ వంటి ప్రధాన నగరాల్లోని విలాసవంతమైన ఆపిల్ స్టోర్లు, లూయిస్ విట్టన్ షాపులు, సూపర్‌మార్కెట్లలోకి చొరబడి నిరసనకారులు భారీగా లూటీలు చేశారు. పారిస్ వీధుల్లో వందలాది కార్లు, రవాణా వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.పరిస్థితి అదుపు తప్పడంతో ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి రాజీనామాకు సిద్దమయ్యారు. 

ఇదిలాఉండగా.. ఫ్రాన్స్​ లో హింసాత్మక నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​దళాన్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. అల్లర్లు దోపిడీలను అడ్డుకునేందుకు  కర్ఫ్యూ విధించాలని  పోలీసులను అదేశించారు ఫ్రాన్స్ ప్రధాని. మంగళవారం జరగాల్సిన పారిస్​ సెయింట్, జెర్మైన్​బార్సిలోనా ఫుట్​ బాల్​ మ్యాచ్​ యథాతధంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని అన్నారు.