- ఒక్క పారిస్‌లోనే 1.10 లక్షల మంది రోడ్లపైకి
- ఆందోళనకారులను చెదరగొట్టడానికి రంగంలోకి 70వేల మంది పోలీసులు
పారిస్: భారీ నిరసనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. జీవన వ్యయం పెరుగుదల, విద్యా సౌకర్యాల కొరతను వ్యతిరేకిస్తూ శనివారం ఫ్రాన్స్ వ్యాప్తంగా ఏకంగా 4 లక్షల 10 వేల మందికి పైగా స్టూడెంట్లు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఒక్క పారిస్‌లోనే 1.10 లక్షల మంది నిరసనలో పాల్గొన్నారు. పారిస్‌లో ప్రారంభమై, ముగింపు ప్రాంతమైన పోర్టే డి విన్సెంట్ చేరేసరికి కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు.
పోలీసులు వారిపై టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కెనాన్ ప్రయోగించి, 64 మందిని అరెస్ట్ చేశారు. ఆయుధాలు కలిగి ఉండటం, హింస, ఆస్తి ధ్వంసానికి పాల్పడుతున్న ఆరోపణలపైనే ఎక్కువ మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
70 వేల మంది పోలీసుల మోహరింపు
విద్యార్థులు, ప్రజలు శనివారం భారీ నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రాన్స్ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 70 వేల మంది పోలీసులను మోహరించింది. గత వారం(అక్టోబర్ 17న) జరిగిన ఆందోళన దోపిడీలు, విధ్వంసాలు, ఘర్షణలకు దారితీసింది. వేలాది వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని షాపులను నిరసనకారులు లూటీ చేశారు.
నిరసనలపై ఆంక్షలు విధింపు
నిరసనలపై ప్రాన్స్ ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించింది. పారిస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో నిరసనలను, యూనియన్ల మార్చ్‌ను నిషేధించి, సరిహద్దు ప్రాంతాల్లోనే అనుమతినిచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ పారిస్‌లోని దుకాణాలు, 24 మెట్రో స్టేషన్లతో పాటు లౌవ్రి మ్యూజియం వంటి ప్రముఖ సాంస్కృతిక కేంద్రాలను మూసివేశారు.
ఉద్రిక్తతలను చల్లార్చేందుకు విద్యార్థి సంఘాలతో మాక్రాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సెప్టెంబరులో స్కూల్ సమస్యలతో మొదలైన నిరసన.. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మారింది. మరో ఆరు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.
