పారిస్: జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో బోణీ చేశాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండోసీడ్ జ్వెరెవ్ 6–3, 6–4, 6–2తో బెంజమిన్ బొంజీ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండు గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ఓ వైపు ఎండ దంచినా.. జ్వెరెవ్ తొలి సెట్ నుంచే పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు.
తొలి సెట్ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఈజీగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు పరస్పరం సర్వీస్‌లు బ్రేక్ చేసుకున్నప్పటికీ కీలక టైమ్‌లో బొంజీ సర్వ్‌ను బ్రేక్ చేసి 5–4 లీడ్‌లోకి వెళ్లాడు. వెంటనే తన సర్వీస్ కాపాడుకుని సెట్ నెగ్గాడు.
మూడో సెట్‌లో బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో వరుసగా పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో కచనోవ్ (రష్యా) 6–3, 7–6 (7/3), 6–0తో ఆర్థర్ గీ (ఫ్రాన్స్)పై, మెన్సిక్ (చెక్) 6–3, 6–2, 6–4తో డ్రోగెట్ (ఫ్రాన్స్)పై, డెవిడోవిచ్ (స్పెయిన్) 6–7 (3/7), 6–3, 2–6, 7–5, 6–3తో డామిర్ జుమ్‌హర్ (బోస్నియా)పై గెలిచారు.
విమెన్స్ సింగిల్స్‌లో ఆండ్రీవా (రష్యా) 6–3, 6–3తో ఫియానో ఫెర్రో (ఫ్రాన్స్)పై, బెనిసిచ్ (స్విట్జర్లాండ్) 6–2, 6–3తో సింజా క్రౌస్ (ఆస్ట్రియా)పై, మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్) 6–2, 6–3తో ఒక్సానా సెలెక్మెటోవా (స్పెయిన్)పై, బాప్టిస్ట్ (అమెరికా) 6–7 (7/9), 7–6 (8/6), 6–2తో క్రెజికోవా (చెక్)పై, వాంగ్ (చైనా) 6–3, 3–6, 6–4తో లిల్లీ టాగర్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
