దేశానికి సమాధానం చెప్పాల్సిందే..అరుణాచల్ లో భారత్, చైనా సరిహద్దు వద్ద ఘర్షణ

దేశానికి సమాధానం చెప్పాల్సిందే..అరుణాచల్ లో భారత్, చైనా సరిహద్దు వద్ద ఘర్షణ
  • ప్రధాని మోదీ మౌనంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో చైనా పీపుల్స్ ​లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌‌‌‌‌‌‌‌ఏ)తో  తలెత్తిన ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బార్డర్​లో పరిస్థితులపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది.

 చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశాల్లో సరిహద్దు సమస్యలను ప్రస్తావించనందుకు పీఎంను పిరికిపందగా అభివర్ణించింది. సరిహద్దులో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయని, గత కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో ముఖాముఖి (ఫేస్​ఆఫ్) ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. 

అది ఇంకా కొనసాగుతూనే ఉందని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ అంగీకరించడంతో చైనా అసలు రూపం బట్టబయలైందని పేర్కొంది. తూర్పు లడఖ్‌‌‌‌‌‌‌‌లో హింస చెలరేగిన తర్వాత 2020లో ప్రధాని ఇచ్చిన ‘క్లీన్ చిట్’ వల్లే చైనాకు అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మరింత ధైర్యం వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్ష విమర్శలపై  కేంద్రం ప్రభుత్వం లేదా బీజేపీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. 

గాల్వాన్ తర్వాతే రెచ్చిపోతున్న చైనా: జైరాం రమేశ్ 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. చైనా అంశంపై ప్రధాని, ఆయన వర్గం  మౌనంగా ఉంటుందని మండిపడ్డారు. జూన్ 19, 2020న 20 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రధాని ఇచ్చిన ‘నా కోయ్ వహాన్ హమారి సీమా మే ఘుస్ ఆయా హై’ (ఎవరూ మన సరిహద్దుల్లోకి రాలేదు) అనే అపఖ్యాతి మూటగట్టుకున్న క్లీన్ చిట్ మూలంగానే భారత్ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన ఆరోపించారు. 

దేశానికి ‘56 అంగుళాల ఛాతీ’పై డొల్ల ప్రకటనలు అక్కర్లేదని, జాతీయ భద్రతపై స్పష్టమైన సమాధానాలు కావాలని డిమాండ్ చేశారు. గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ ఇచ్చిన క్లీన్ చిట్ వల్లే చైనా మరింతగా రెచ్చిపోతోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం మౌనం వీడాలన్నారు.

ప్రజలకు నిజం చెప్పండి: ఖర్గే

‘చైనాకు ఇచ్చిన క్లీన్ చిట్లు చాలు, ప్రధాని మోదీ దేశం ముందు నిజం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  డిమాండ్​చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్ సాయుధ బలగాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, అయితే ‘జాతీయ భద్రతకు దౌత్యపరమైన ఫొటో అవకాశాలు, ఆలింగనాలు కాకుండా జవాబుదారీతనం అవసరమన్నారు. ప్రతిపక్షాలపై దాడి చేయడం మాని, ప్రధాని మోదీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ను, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు.