డిజిటల్ యుగంలో ఒక క్లిక్ తో ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. ఫోన్ స్క్రీన్ పై కొన్ని సెకన్ల పాటు కనిపించే వీడియోలు కోట్లాది మందిని నవ్విస్తున్నాయి. క్రియేటర్లను సెలబ్రిటీలుగా మారుస్తున్నాయి. అందుకే అదే మార్గాన్ని ఎంచుకున్నారు సూరజ్, విక్రమ్. కొత్త కొత్త కాన్సెప్ట్ తో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఏ భాష మాట్లాడేవాళ్లకైనా అర్థమయ్యేలా కంటెంట్ క్రియేట్ చేస్తూ.. కోట్లాది మందిని నవ్విస్తున్నారు.
జార్ఖండ్లోని కోడెర్మాలో ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో పుట్టి పెరిగాడు సూరజ్ రాక్స్ (అసలు పేరు సూరజ్). అతనికి చిన్నప్పటి నుంచే కామెడీ, డ్రామా, యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉండేది. సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోలకు పాపులారిటీ పెరగడంతో అతను కూడా అలాంటి వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే టిటిక్ టాక్ లో వీడియోలు చేసిన అనుభవం ఉండడంతో తన ఫ్రెండ్ విక్రమ్ కలిసి 2021లో రియల్ ఫూల్స్ షార్ట్స్ అఫీషియల్' పేరుతో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాడు. ఈ చానెల్లో మొదటి నుంచి షార్ట్ కామెడీ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు.
మొదట్లో తక్కువే..
చానెల్ పెట్టిన కొత్తలో వీడియోలకు పెద్దగా వ్యూస్ రాలేదు. 2022- 2023లో వైరల్ ట్రెండ్స్, హిందీ/ బీహారీ/జార్ఖండీ యాసలో కామెడీ స్కిట్స్, వీచిత్రమైన రియాక్షన్స్ వీడియోలు చేసి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. దాంతో చానెల్ బాగా బూస్ట్ అయ్యింది. సూరజ్,
విక్రమ్ తో పాటు వాళ్ల ఫ్రెండ్స్ దీపక్ రాక్స్, అఖిల్ ఆర్య, రోషన్ రాక్స్, అజయ్ కూడా చానెల్ కోసం పనిచేస్తున్నారు. వీళ్లంతా వీడియోల్లో కనిపిస్తారు. అందరి సహకారంతోనే చానెల్ సక్సెస్ అయ్యింది. చానెల్ పెట్టిన రెండేండ్లలో అంటే 2023లో 10 మిలియన్ సబ్స్కయిబర్ల మార్క్ని దాటింది. 2025 నాటికి ఆ సంఖ్య 50 మిలియన్లకు చేరింది. ప్రస్తుతం 52.6 మిలియన్ల సబ్స్కయిబర్లతో ఇండియాలోని టాప్ షార్ట్ వీడియోస్ చానెల్స్ లో ముందువరుసలో నిలిచింది.
లక్షల్లో వ్యూస్
చానెల్ లో పెట్టిన ప్రతి వీడియోకు మీలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. సూరజ్, విక్రమ్ కలిసి చేసిన ఒక వీడియోకు ఏకంగా 41 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 200 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చానెల్లో 5 ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా నెలకు రూ.2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు.. ప్రమోషన్స్, స్పాన్సర్షిప్స్ నుంచి కూడా లక్షల్లో ఆదాయం వస్తోంది. అలా ఇప్పటివరకు 4-5 కోట్ల వరకు సంపాదించారని అంచనా.
ఆ పేరెందుకు ?
మొదట్లో సూరజ్, విక్రమ్ టిక్టాక్లో కామెడీ వీడియోలు చేసేవాళ్లు. అది బ్యాన్ అయ్యాక యూట్యూబ్ చానెల్ పెట్టారు. రోజువారీ జీవితంలో కనిపించే సాధారణ మనుషులు, చిన్న చిన్న సంఘటనలు, కొందరు అమాయకత్వంతో చేసే పొరపాట్లే వాళ్ల కంటెంట్. అందుకే చానెల్కు 'రియల్ 'ఫూల్స్' అనే పేరు పెట్టారు. అంతేకాదు.. వీడియోల్లో ఎవరినీ అవమానించకుండా,టార్గెట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తారు. సూరజ్, విక్రమ్.. యాక్టింగ్, వీడియో షూటింగ్, ఎడిటింగ్, అప్లోడ్ అన్నీ సాఫీగా సాగిపోయేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దానివల్లే . క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయగలుగుతున్నాడు. అదే వాళ్ల సక్సెస్కు కారణమైంది.
మరో రెండు చానెల్స్
వీళ్లకు రియల్ ఫూల్స్ షార్ట్స్ అఫీషియల్ తోపాటు 'రియల్ ఫూల్స్ ' పేరుతో మరో చానెల్ కూడా ఉంది. దానికి 4.41 మిలియన్ల సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. ఆ చానెల్లో రెగ్యులర్ గా లాంగ్ ఫార్మాట్ కామెడీ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. 'ది కామెడీ కింగ్డమ్ ' పేరుతో మరో చానెల్ కూడా నడుపుతున్నారు. దాన్ని 5.1 మిలియన్ల మంది సబ్రయిబ్ చేసుకున్నారు. టీమ్ అందరూ ఈ రెండు చానెళ్లలో కనిపిస్తుంటారు. ఇవే కాకుండా టీమ్ కొందరికి పర్సనల్ గా కూడా చానెల్స్ ఉన్నాయి.
