ఇండియాలో ఆహార కల్తీ వార్తలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. పెద్దపెద్ద బ్రాండెడ్ కంపెనీలే వీటికి కేంద్రాలుగా మారుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఉక్కుపాదం మోపింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ప్రముఖ సంస్థల బండారాన్ని డిపార్ట్మెంట్ బయటపెడుతోంది. తాజాగా ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల దాణా ఊకను వాడటం, ప్రసిద్ధ దొడ్ల డెయిరీ పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఆనవాళ్లు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలకు దిగారు.
బిస్కెట్లలో పశువుల దాణా ఊక:
ప్రముఖ ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీ సంస్థ అయిన సూర్య ఫుడ్ అండ్ అగ్రో దందా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తనిఖీల్లో బయటపడింది. ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫ్యాక్టరీలో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు బయటపడ్డాయి. ఫైబర్ కోసం మనుషుల వినియోగానికి అసలు పనికిరాని.. పశువుల దాణా ఊకను బిస్కెట్ల తయారీలో ముడిసరుకుగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మేరకు ఆ గోనె సంచులపై పశువుల దాణా అని స్పష్టంగా ముద్రించి ఉన్నట్లు తేలింది. దీనితో పాటు పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, ముడిసరుకుల నిల్వలో తీవ్ర లోపాలు ఉండటంతో గతంలోనే కంపెనీ లైసెన్స్ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఇప్పుడు నేరుగా కోర్టులో ప్రాసిక్యూషన్కు సిద్ధమయ్యారు.
దొడ్ల డెయిరీ పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా:
ప్రముఖ డైరీ రంగ సంస్థ 'దొడ్ల డెయిరీ'కి చెందిన ఫుల్ క్రీమ్ పాల శాంపిల్స్ పరీక్షించగా అందులో పాలు మిల్క్ ఫ్యాట్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. కంపెనీ అప్పీల్ చేయడంతో ఆ నమూనాలను ప్రతిష్టాత్మక రిఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపించారు. అక్కడ చేసిన టెస్టుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దొడ్ల పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఉన్నట్లు ల్యాబ్ టెస్ట్ నిర్ధారించింది. దీంతో కంపెనీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఆర్గానిక్ ఫుడ్స్లో పురుగు మందు అవశేషాలు:
కేవలం బిస్కెట్లు, పాలు కాకుండా యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ (UEIR Organic Foods) విక్రయిస్తున్న ఎల్లో కిస్మిస్ లోనూ ప్రమాదకరమైన పురుగుల మందుల అవశేషాలను అధికారులు గుర్తించారు. నాణ్యమైన, ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో అమ్ముతున్న ఈ కిస్మిస్లో క్రిమిసంహారక మందల ఆనవాళ్లు ఉండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కంపెనీపై కేసులు నమోదు చేసిన అధికారులు నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎంతటి బ్రాండ్లయినాసరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
