రామప్పతో ములుగును సస్యశ్యామలం చేస్తాం.. ఆలయానికి ముప్పు రానీయబోం: మంత్రి సీతక్క

రామప్పతో ములుగును సస్యశ్యామలం చేస్తాం.. ఆలయానికి ముప్పు రానీయబోం:     మంత్రి సీతక్క

వెంకటాపూర్( రామప్ప ), వెలుగు : ములుగు జిల్లాలోని రామప్ప జలాశయాన్ని నిత్యం గోదావరి జలాలతో నింపి, నాలుగు మండలాల ప్రజలకు తాగునీరు,  రైతులకు సాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం వెంకటపూర్​ లో ఆమె పర్యటించారు. 

రామప్ప తూము, ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవని ఈ తరుణంలో ఖరీఫ్ పంట అవసరాల కోసం రామప్ప జలాశయంలోని నీటిని మళ్లించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, రాబోయే యాసంగి పంట వేయకపోవడమే మంచిదని సూచించారు. 

ఎనిమిది పంపుల ద్వారా జరుగుతున్న నీటి శుద్ధి విధానాన్ని పరిశీలించి మిషన్ భగీరథ నీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వెంకటాపూర్ మండలం రామాంజపూర్ గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి సంస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మల్లాడి రామ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, పాలంపేట, ఎల్లారెడ్డిపల్లి, కేశవాపూర్​ సర్పంచులు చల్లగొండ రాజు, భాషబోయిన పోశాలు, తోట భద్రయ్య  పాల్గొన్నారు.  

రామప్ప ఆలయానికి ముప్పు రానీయబోం

వెంకటాపూర్ శివారులో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు వల్ల యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప ఆలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్ రావు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.

 దీనిపైమంత్రి స్పందిస్తూ ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇవ్వడంతో పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.