తా జాగా నార్త్‌వెస్టర్న్ మ్యూచువల్ 2026 ప్లానింగ్ అండ్ ప్రోగ్రెస్ స్టడీ ప్రకారం, అమెరికాలో 72 శాతం జెన్ జెడ్ (1997 -2012) యువత తాము ఇంకా తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. మిలీనియల్స్ (1981 –1996)లో ఇది 53 శాతం, జెన్ ఎక్స్ (1965–1980)లో 33 శాతంగా ఉంది. జెన్ జెడ్‌లో కేవలం 24 శాతం మంది మాత్రమే అవసరమైతే తల్లిదండ్రుల సాయం లేకుండా తమను తాము పూర్తిగా పోషించుకోగలమని తెలిపారు.
ఇది కేవలం యువత డబ్బు విలువ తెలియకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి కాదు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇళ్ల ధరలు, విద్యా ఖర్చులు, అప్పులు, ఉద్యోగ మార్కెట్‌లో మార్పులు వంటి అనేక కారణాలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఆలస్యం చేస్తున్నాయి.
ఉద్యోగం ఉన్నా అద్దె, రుణాలు, బీమా, రోజువారీ ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు వంటి బాధ్యతల తర్వాత చేతిలో మిగిలేది తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల సాయం ఒక అవసరంగా మారుతోంది.
సొంత ఇల్లు.. ఇంకా దూరమే
జెన్ జెడ్ ఆర్థిక ఒత్తిడికి ప్రధాన ప్రతీకగా ఇల్లు కొనడం కనిపిస్తోంది. ఇల్లు లేని జెన్ జెడ్‌లో 54 శాతం మంది ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఇల్లు కొనడం తమకు సాధ్యమవుతుందని భావిస్తున్నప్పటికీ.. తగినంత డౌన్ పేమెంట్ లేకపోవడం, ఇంటి బీమా, మరమ్మతులు వంటి అదనపు ఖర్చులను భరించగలమనే నమ్మకం లేకపోవడం, అధిక రుణ వడ్డీలు, పోటీతో కూడిన గృహ మార్కెట్ వంటి అంశాలు అడ్డంకులుగా ఉన్నాయి.
2026లో డౌన్ పేమెంట్ కోసం తగినంత పొదుపు లేదని 52 శాతం జెన్ జెడ్ యువత, ఇంటి అదనపు ఖర్చులను భరించలేమని 47 శాతం, రుణ వడ్డీలు అధికంగా ఉన్నాయని 43 శాతం, మార్కెట్ ధరలకు తాము దూరమవుతున్నామని 42 శాతం తెలిపారు.
ఇల్లు ఆలస్యమైతే.. పెళ్లి, పిల్లలూ ఆలస్యమే
ఆర్థిక ఒత్తిడి ఇల్లు కొనడానికే పరిమితం కావడం లేదు. పెళ్లి, పిల్లలు వంటి కీలక నిర్ణయాలపైనా ప్రభావం చూపుతోంది. ఇల్లు కొనడాన్ని 31 శాతం మంది, పెళ్లిని 20 శాతం మంది, పిల్లలను కనాలనే నిర్ణయాన్ని 24 శాతం మంది ఆర్థిక కారణాలతో వాయిదా వేసినట్లు అధ్యయనం తెలిపింది. పిల్లల పెంపకం, ఆరోగ్యం, విద్య వంటి భవిష్యత్తు ఖర్చులపై ఉన్న ఆందోళన కూడా కుటుంబ నిర్ణయాలను వెనక్కి నెడుతోంది.
చదువు కూడా భారమే
మంచి ఉద్యోగం కోసం ఉన్నత విద్య అవసరమే. కానీ ఆ విద్యకే భారీ ఖర్చు కావడం మరో సమస్య. కళాశాల లేదా ఉన్నత విద్య ఖర్చులను ఆర్థిక కారణాలతో 26 శాతం జెన్ జెడ్ యువత వాయిదా వేసినట్లు అధ్యయనం తెలిపింది. విద్యా రుణాలు, జీవన వ్యయం కలిసి యువత సంపాదన మొదలయ్యేలోపే ఆర్థిక బాధ్యతలను పెంచుతున్నాయి.
కృత్రిమ మేధతో మరో ఆందోళన
ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించే మార్గంలో ఉద్యోగ భద్రత కూడా కీలకం. కృత్రిమ మేధ కారణంగా అనేక ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో తమ కెరీర్‌పై దాని ప్రభావం పట్ల 46 శాతం జెన్ జెడ్ యువత ప్రతికూలంగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. నేర్చుకున్న నైపుణ్యాలకు భవిష్యత్తులో విలువ ఉంటుందా? ఆదాయం స్థిరంగా కొనసాగుతుందా? అన్న అనిశ్చితి వారి ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది.
అయినా ఆశ మాత్రం ఉంది
తల్లిదండ్రులపై ఆధారపడుతున్నప్పటికీ ఈ తరం పూర్తిగా నిరాశలో లేదు. ఆర్థికంగా ఆధారపడుతున్న జెన్ జెడ్‌లో 82 శాతం మంది భవిష్యత్తులో తాము స్వతంత్రంగా మారగలమని నమ్ముతున్నారు. అంతేకాదు.. పదవీ విరమణ కోసం సగటున 22 ఏళ్లకే పొదుపు మొదలుపెడుతున్నట్లు అధ్యయనం తెలిపింది.
భవిష్యత్తులో 61 ఏళ్లకే పదవీ విరమణ చేయాలని వారు భావిస్తున్నారు. అందుకే 72 శాతం అనే సంఖ్యను ‘తల్లిదండ్రుల డబ్బుపై ఆధారపడుతున్న తరం’గా మాత్రమే చూడటం సరైంది కాదు. ఇది మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అద్దం. గత తరాలతో పోలిస్తే ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం కష్టమైందని 56 శాతం అమెరికన్లు, 47 శాతం జెన్ జెడ్ యువత చెప్తోంది.
ఇల్లు, పెళ్లి, పిల్లలు, చదువు వంటి జీవిత మైలురాళ్లు ఇప్పుడు వయసుతో కాకుండా ఆర్థిక సామర్థ్యంతో ముడిపడుతున్నాయి. తల్లిదండ్రుల సాయం ఈ తరానికి బలహీనత కంటే.. ఆర్థికంగా నిలబడేవరకు ఒక ఆధారంగా మారుతోంది.
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
