న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన పాఠం 6వ తరగతి జనరల్ నాలెడ్జ్ (జీకే) పుస్తకంలో ఉండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి పుస్తకంలోని మెలోని పేజీని చూపిస్తూ ‘‘భాయ్ సాబ్! వీరి గురించి జీకేలో ఒక పాఠమే ఉంది’’ అంటూ సరదాగా చేసిన కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పుస్తకం ప్రకారం.. మెలోని 1977 జనవరి 15న రోమ్‌లో జన్మించారు.
15 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని సహ స్థాపించి, 2014లో ఆ పార్టీకి నాయకురాలయ్యారు. 2022లో ఇటలీ పీఎంగా బాధ్యతలు చేపట్టిన మెలోని.. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2024లో అట్లాంటిక్ కౌన్సిల్ నుంచి ‘గ్లోబల్ సిటిజన్ అవార్డు’ అందుకున్నారు. ఇటలీ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ విధానాలు, వలస విధానాల్లో ఆమె చేపట్టిన మార్పులు, సంస్కరణలను కూడా పాఠంలో వివరించారు.
