హైదరాబాద్ లో KBR పార్క్ చుట్టూ మొదలుపెట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాస్ ల స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. గురువారం ( అక్టోబర్ 15 ) కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలివేటెడ్ కారిడార్ పనులు పరిశీలించారు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్ తో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు కర్ణన్. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్, అగ్రసేన్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ దగ్గర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కోసం 6-లేన్ బై డైరెక్షనల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ట్రాఫిక్ సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ముగ్ధ జంక్షన్–ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మధ్య ఫౌండేషన్ డిజైన్ కోసం జియోటెక్నికల్ పరిశోధనలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్–ముగ్ధ జంక్షన్ మధ్య ఫౌండేషన్ తవ్వకాల పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఫ్లైఓవర్ స్టీల్ భాగాల ఫ్యాబ్రికేషన్ పనులను సమాంతరంగా చేపట్టాలని.. నిర్మాణ సమయంలో వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేలా జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు GHMC కమిషనర్ కర్ణన్.
