హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీలోనూ చర్యలు మొదలయ్యాయి. శుక్రవారం నగరంలోని మూడు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గోల్కొండ జోన్ గోషామహల్ సర్కిల్ పరిధిలోని బేగంబజార్ ఫీల్ఖానా, అజీజ్ ప్లాజా సమీపంలో 70 చదరపు గజాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించిన సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పై అంతస్తులు కూల్చేశారు.
ఖైరతాబాద్ జోన్ రెడ్హిల్స్లో 90 చదరపు గజాల్లో కట్టిన మూడో, నాలుగో, ఐదో అంతస్తులను పడగొట్టారు. సికింద్రాబాద్ జోన్ చిక్కడపల్లిలో 357 చదరపు గజాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన నాలుగో అంతస్తును కూలగొట్టారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా లేదా మంజూరైన ప్లాన్ కి విరుద్ధంగా నిర్మిస్తున్న 473 కట్టడాలను అధికారులు గుర్తించారు. వీటికి నోటీసులు జారీ చేయడంతో పాటు కూలగొట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
