హైదరాబాద్ సిటీ, వెలుగు: శంషాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన రోడ్ల విస్తరణ పనులను జీహెచ్‌ఎంసీ స్పీడప్ చేసింది. శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ఔటర్ కు కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో పై రెండు ప్రాంతాల్లో రెండు కీలక రోడ్ల విస్తరణకు భూసేకరణను ప్రారంభించింది.
నాలుగేండ్ల కిందటే ఈ రోడ్ల విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినా, తర్వాత ఎందుకో పనులు ముందుకు సాగలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దపెద్ద నిర్మాణాలు వెలిశాయి. రోడ్డు విస్తరణ నిలిచిపోవడంతో వాహనాల రద్దీ పెరిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఈ రోడ్ల విస్తరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
గొల్లపల్లి నుంచి..పెద్ద గోల్కొండ వరకు..
శంషాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో100 ఫీట్ల వెడల్పుతో రెండు మెయిన్రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను బల్దియా ప్రారంభించింది. గొల్లపల్లి, కిస్మత్ పూర్ ప్రాంతాల్లో 23,496 చదరపు గజాల భూమి సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. శంషాబాద్ మండలం గొల్లపల్లి ఎన్‌హెచ్-40 జంక్షన్ నుంచి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా పెద్ద గోల్కొండ వరకు కారిడార్ నంబర్15లో భాగంగా100 ఫీట్ల రోడ్డు విస్తరించనున్నారు.
ఈ రూట్ లో ఎడమవైపు ఉన్న 59 ఆస్తులకు సంబంధించి 10,387 చదరపు గజాల భూమిని సేకరించనున్నారు. ఈ భూసేకరణ పరిధిలో ఖాళీ జాగలతో పాటు కమర్షియల్బిల్డింగులు, షెడ్లు, ఇండ్లు ఉన్నాయి.
ఓఆర్‌ఆర్ – బండ్లగూడ జాగీర్ టు చేవెళ్ల..
రాజేంద్రనగర్ మండల పరిధిలోని కారిడార్ నంబర్19 లోనూ రోడ్ల విస్తరణ పనులు మొదలుకానున్నాయి. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి బండ్లగూడ జాగీర్, కిస్మత్ పూర్ మీదుగా చేవెళ్ల రోడ్డుకు అనుసంధానించేలా 100 ఫీట్ల రోడ్డు విస్తరించున్నారు.
ఈ రూట్ లో 13,108 చదరపు గజాల భూమిని జీహెచ్ఎంసీ సేకరించనున్నది. ఈ పరిధిలో వ్యాపార సముదాయాలు, దవాఖానలు, పెట్రోల్ బంకులు, ఖాళీ స్థలాలు, మల్టీస్టోరుడ్బిల్డింగులు ఉన్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం....
శివారు ప్రాంతాల్లో నివాసాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ చేస్తామని జీవో విడుదల చేశారు. అయితే ఈ రోడ్ల విస్తరణకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ చూపుతూ నిర్మాణాలు వస్తున్నాయి. అయితే 10 నుంచి 40, 50 అంతస్థుల్లో నిర్మాణాలు వచ్చాయి. ఇందులో నివసించేవారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ రహదారులపై వాహనాల రద్దీ కూడా అధికమవుతోంది. అయితే రోడ్ల విస్తరణ చేయకుండానే నిర్మాణాలు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఓఆర్‌ఆర్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు రాకపోకలు ఈజీ చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రోడ్ల వైడెనింగ్ చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయి రహదారుల నిర్మాణం జరిగితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయం తగ్గడంతోపాటు పరిసర కాలనీలకు రహదారి అనుసంధానం మెరుగుపడే అవకాశం ఉంది.
అభ్యంతరాలకు రెండు నుంచి మూడు నెలలు
భూసేకరణకి సంబంధించి అభ్యంతరాలను 60 రోజుల్లో తెలియజేయాలని జీహెచ్ఎంసీ భూసేకరణ అధికారులు నోటిఫికేషన్ లో ప్రాపర్టీదారులకు సూచించారు. భూయజమానులు, బాధితులు, నష్టపరిహారంపై అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు ఉన్నవారు జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసులోని ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ కలెక్టర్ ఆఫీసులో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూముల మ్యాప్‌లు, ప్లాన్లను ఆఫీసులో పరిశీలించవచ్చన్నారు.
ఇందులో గొల్లపల్లి రోడ్డుకి సంబంధించి అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుంది. కిస్మత్ పురా రోడ్డుకి సంబంధించి మూడు నెలల సమయం ఉంది. ఆస్తుల సేకరణ తర్వాత వెడల్పు పనులు స్టార్ట్ కానున్నాయి.
