ఇసుక లారీ బీభత్సం.. ఆఖరి క్షణంలో బంపర్ పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న యువతి

ఇసుక లారీ బీభత్సం.. ఆఖరి క్షణంలో  బంపర్ పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న యువతి

 మహారాష్ట్రలో  తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఓ యువతి ప్రమాదంలో చిక్కుకుంది. అయితే క్షణాల్లో అప్రమత్తమై లారీ బంపర్‌ను పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ  ఫుటేజ్  ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

బెలాపూర్ రోడ్డుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సుమారు రెండు నిమిషాల వీడియోలో.. ఇసుకతో వెళ్తున్న లారీ వేగంగా రావడం కనిపించింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా ఒక్కసారిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో పక్కనే వెళ్తున్న స్కూటీని లారీ బలంగా ఢీకొట్టింది.  ఈ ప్రమాదంతో యువతి స్కూటీతో సహా కిందపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, వెంటనే స్పందించిన ఆమె లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో లారీ చక్రాల కింద పడకుండా ప్రాణాలతో బయటపడింది. అనంతరం లేచి నిలబడి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె పరిస్థితిని పరిశీలించారు.

కొద్దిసేపటి తర్వాత లారీ డ్రైవర్ వాహనం నుంచి కిందకు దిగి స్కూటీని పరిశీలించాడు. అక్కడికి చేరుకున్న స్థానికులతో అతడు వాగ్వాదానికి దిగినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో జనం గుమిగూడటంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. 

ALSO READ : అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్..

నంబర్ ప్లేట్ లేని ఇసుక లారీ?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రమాదానికి కారణమైన లారీకి నంబర్ ప్లేట్ లేదని తెలుస్తోంది. ఈ వాహనం వైజాపూర్‌లోని మహల్‌గావ్ ఇసుక వేలానికి సంబంధించినదిగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ వివరాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.  ఈ ఘటనతో ఆ ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాలు, అతివేగంతో నడుపుతున్న ఇసుక లారీల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.