నగరాల్లో తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

నగరాల్లో తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

నగరాల్లో తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

న్యూఢిల్లీ :  గ్లోబల్ కంపెనీలు తమ ఆఫీసుల కోసం బిల్డింగులను లీజింగ్‌‌లో తీసుకోవడం తగ్గిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య ఆఫీస్​ లీజింగ్​ 22 శాతం  తగ్గింది. కుష్‌‌మాన్ & వేక్‌‌ఫీల్డ్ రిపోర్టు ప్రకారం..  కార్పొరేట్‌‌లు  వ్యాపారాల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అందుకే ఆఫీస్ లీజింగ్ ఈ ఏడాది ఏప్రిల్ -జూన్‌‌లో 22.41 మిలియన్ చదరపు అడుగుల నుంచి 17.42 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. అంతకుముందు క్వార్టర్​11 శాతం పెరిగి 15.7 మిలియన్ చదరపు అడుగులు అమ్ముడయింది.  

ఏపీఏసీ టెనెంట్​కు చెందిన అన్షుల్ జైన్ మాట్లాడుతూ, " ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపు కొనసాగుతోంది.  ఆర్థిక మాంద్యం ఇబ్బందులను ఇండియా ఎదర్కోగలగడం ఇందుకు ముఖ్యకారణం  ”అని  తెలిపారు. కోవర్కింగ్​ స్పేస్ ఆపరేటర్ అర్బన్ వాల్ట్ కో–ఫౌండర్​ అమల్ మిశ్రా మాట్లాడుతూ అంతర్జాతీయ ఇబ్బందుల కారణంగా కార్పొరేట్లు   ఆఫీస్ స్థలాన్ని  తీసుకోవడంలో జాగ్రత్తగా ఉంటున్నారని పేర్కొన్నారు. 

* కుష్​మన్​ డేటా ప్రకారం, గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఐదు ప్రధాన నగరాల్లో పడిపోయింది.  గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్–-జూన్ కాలంలో మూడు నగరాల్లో మాత్రమే పెరిగింది. 

* ముంబైలో  గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఏప్రిల్–-జూన్‌‌లో 2.99 మిలియన్ చదరపు అడుగుల నుంచి 9 శాతం తగ్గి 2.73 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. 

* ఢిల్లీలో  గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 5 శాతం వృద్ధితో  3.41 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.59 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. 

* అంతర్జాతీయ మార్కెట్లలో ఇబ్బందుల వల్ల ఐటీ కంపెనీలు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల బెంగళూరులో డిమాండ్​ తగ్గింది. గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 6.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 56 శాతం తగ్గి 3.03 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

* చెన్నైలో కూడా ఆఫీస్ లీజులో 41 శాతం పడిపోయింది. ఇది 2.66 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.58 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. 

* పూణేలో  గ్రాస్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 6 శాతం పెరిగి 2.93 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.11 మిలియన్ చదరపు అడుగులకు ఎగిసింది. 

* హైదరాబాద్‌‌లో ఆఫీస్ డిమాండ్ 2.71 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2 శాతం తగ్గి 2.65 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. 

* కోల్‌‌కతాలో 3,20,719 చదరపు అడుగుల నుంచి 2,18,235 చదరపు అడుగులకు .. అంటే 32 శాతం తగ్గింది. 

* అహ్మదాబాద్‌‌లో 4,71,320 చదరపు అడుగుల నుంచి 3 శాతం పెరిగి 4,85,822 చదరపు అడుగులకు చేరుకుంది.