Varanasi: రాజమౌళి - మహేష్ బాబుల ' వారణాసి ' గ్లోబల్ సునామీ.. రికార్డు స్థాయిలో ఓవర్సీస్ ఆఫర్స్!

 Varanasi: రాజమౌళి - మహేష్ బాబుల ' వారణాసి ' గ్లోబల్ సునామీ.. రికార్డు స్థాయిలో  ఓవర్సీస్ ఆఫర్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ . ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారా స్థాయికి చేరాయి.  ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని సరికొత్త విజువల్ వండర్‌గా ఈ మూవీ రానుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ దశలోనే రికార్డుల వేట మొదలు పెట్టింది.

రికార్డు స్థాయిలో ఓవర్సీస్ ఆఫర్

ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం పంపిణీ రంగంలో దిగ్గజమైన ‘ఫార్స్ ఫిలిమ్స్’ (Phars Films) ఏకంగా రూ. 160 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఫుల్ టాక్ నడుస్తోంది. అన్ని భారతీయ భాషలకు కలిపి కేవలం ఓవర్సీస్ రైట్స్ కోసమే ఈ స్థాయి రేటు పలకడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డ్. గతంలో రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సృష్టించిన ప్రభంజనం వల్లనే ఈ సినిమాకు అప్పుడే ఈ రేంజ్ డిమాండ్ ఏర్పడిందని టాక్ నడుస్తోంది. 

ఒకవేళ ఈ డీల్ కుదిరితే, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. మహేష్ బాబుకున్న గ్లోబల్ అప్పీల్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ చూస్తుంటే ఇది అసాధ్యమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

భారీ బడ్జెట్ తో.. 

ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే అన్వేషకుడి పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియంకా చోప్రా 'మందాకిని'గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో ఉన్నారు.  ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ మూవీని దాదాపు రూ.1300 కోట్ల భారీ వ్యయంతో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అంటార్కిటికాలో షూటింగ్.. 

అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం అంటార్కిటికా, కెన్యా వంటి అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేష్ బాబు ఎద్దుపై వస్తూ త్రిశూలం పట్టుకున్న విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'వారణాసి' చిత్రం కేవలం ఇండియన్ సినిమాగానే కాకుండా, హాలీవుడ్ స్థాయిలో ఒక పాన్-వరల్డ్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది.