కూరగాయలు కొన్నట్లు బంగారం కొనేస్తున్న చైనా జనం.. గోల్డ్ షాపులకు క్యూ!

కూరగాయలు కొన్నట్లు బంగారం కొనేస్తున్న చైనా జనం.. గోల్డ్ షాపులకు క్యూ!

బంగారం కోసం చైనా ప్రజలు ఎగబడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో.. చైనాలోని షెంజెన్ గోల్డ్ మార్కెట్‌లో కొనుగోలుదారులు భారీగా పోటెత్తారు. ధరల తగ్గుదలని సద్వినియోగం చేసుకోవడానికి బార్గెయిన్ హంటర్స్ ఎగబడటంతో షాపింగ్ కారిడార్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. కనీసం కదలడానికి కూడా వీలు లేనంత ఇసుక వేస్తే రాలనంత జనం గుమికూడటంతో వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోవడమే ఈ కొనుగోళ్ల జోరుకు ప్రధాన కారణం. సుదీర్ఘకాలంగా విపరీతంగా పెరిగిన బంగారం రేట్లు, తాజాగా సైకలాజికల్ మార్కైన 4వేల డాలర్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్ 23న స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,995.63 డాలర్లకు క్షీణించింది. జూన్ తర్వాత పసిడి ఈ స్థాయిలో వారపు క్షీణతను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ అంతర్జాతీయ ధరల తగ్గుదల ప్రభావం చైనా జ్యువెలరీ మార్కెట్లపై తక్షణమే పడింది. లామియో గోల్డ్, చౌ సాంగ్ సాంగ్, చౌ తాఈ ఫూక్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఆభరణాల ధరలను గ్రాముకు 6 నుంచి 12 యువాన్ల వరకు తగ్గించాయి. అంతకుముందు నెలతో పోలిస్తే రిటైల్ గోల్డ్ జ్యువెలరీ ధరలు ఏకంగా 100 యువాన్ల వరకు తగ్గాయి. ధరలు తగ్గడంతో ఎప్పటికప్పుడు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న సామాన్యులు, పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేవారు ఇప్పుడు మార్కెట్‌కు క్యూ కట్టారు.

చైనాలోని రుహూ జిల్లాలో ఉన్న షెంజెన్ 'షుయిబీ' మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ట్రేడింగ్ సెంటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. హోల్‌సేల్, రిటైల్, తయారీదారులు అందరూ ఒకే చోట దొరికే ఈ మార్కెట్‌కు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇటీవల చైనా నేషనల్ డే సెలవుల సమయంలోనూ రోజుకు దాదాపు 60 వేల మంది సందర్శకులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో రద్దీ మరింత విపరీతంగా పెరిగింది. అక్కడ కూరగాయల మార్కెట్లో కంటే ఎక్కువ జనం బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

చైనా ప్రజలకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక సాంప్రదాయ సంపద. ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కొనుగోళ్లు వాయిదా వేసుకున్న జనం.. ఇప్పుడు రేట్లు తగ్గగానే మార్కెట్‌కు తిరిగి వస్తున్నారు. అయితే ఈ భారీ రద్దీ అంతా వెంటనే కొనుగోళ్లుగా మారుతుందా అంటే సందేహమే. కొందరు ధరలను బేరీజు వేసుకోవడానికి, డిజైన్లు పరిశీలించడానికి అక్కడికి వస్తున్నారంట. మరికొందరైతే ఇంకా ధరలు తగ్గుతాయేమోనని వేచి చూసే ధోరణిలో కూడా వస్తున్నారు.

మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారణంగానే అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ.. ధరలు తగ్గితే చాలు భౌతిక బంగారంపై వినియోగదారులకు ఉండే మక్కువ ఏమాత్రం తగ్గలేదని షెంజెన్ మార్కెట్ నిరూపిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నప్పటికీ.. సామాన్యులు మాత్రం తాజా గోల్డ్ పతనాన్ని తమకు నచ్చిన విధంగా ఉపయోగించుకుంటూనే ఉన్నారు.