శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగాలో ఒక్కో ఆసనానికి ఒక్కో ఆరోగ్య సూత్రం ఉంటుంది. అన్నింటికీ అవే ఆసనాలు కాకుండా... ఏది దేనికి మంచిదో తెలుసుకొని వేయడం మంచిది.అవి వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసనాలు ఎలా వేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉపయోగాలేంటో తెలుసుకుందాం
సుప్త వజ్రాసనం ఎలా చేయాలి?
ముందుగా రెండు కాళ్లను చాచాలి. వాటిని దగ్గర దగ్గరగా ఉంచి రెండు చేతులను పిరుదుల పక్కన ఉంచి కూర్చోవాలి . నెమ్మదిగా కుడికాలిని వెనక్కి మడిచి పాదాన్ని పిరుదులు కింద అదిమి ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలిని కూడా మడిచి పాదాన్ని పిరుదుల కింద ఉంచాలి. మోకాళ్లు రెండు దగ్గర దగ్గరగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. తల,భుజాలు, మొడ కూడా నిటారుగానే ఉండాలి. అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి వంగుతూ మొత్తం శరీరం బరువుంతా మొదట కుడి మోచేయిపైన, తర్వాత నెమ్మదిగా రెండు మోచేతుల పైనా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులూ తలపై ఉంచి వెనక్కి పడుకోవాలి. చివరగా సాధారణ స్థితికి వచ్చేటప్పుడు నిదానంగా అసనం వదలాలి
లాభాలు ఇవే
తొడలు, పిరుదులకు రక్త ప్రసర పెరుగుతుంది. అలాగే మలబద్దకం దూరం అవుతుంది. చాలా సేపు నిలబడి పని చేసేవాళ్లకు ఈఆసనం ఉపయోగకరంగా ఉంటుంది.
జాగ్రత్తలు :
సెర్వికల్ స్పాండిలైటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. నేలపై మోకాళ్లు ఒకదానితో ఒకటి కచ్చితంగా ఆనించే ఉండాలి. అలాగే కిందకు వంగినప్పుడు శ్వాస బయటికి తీయాలి. పైకి లేచేటప్పుడు లోపలికి తీసుకోవాలి
పశ్చిమోత్తాసనం ఎలా చేయాలి
ముందుగా రెండు కాళ్లను చాచాలి. వాటిని దగ్గర దగ్గరగా ఉంచి.. రెండు చేతులను పిరుదుల పక్కన ఉంచి కూర్చోవాలి. రెండు చేతులనూ భుజం ఎత్తులో నేలకు సమాంతరంగా ఉంచాలి. మోచేతులు వంచకూడదు. అరచేతులు నేలను చూడాలి. తర్వాత అరచేతులు ముందుకు ఉండేటట్లుగా చేతులను చెవులకు అనిస్తూ పైకి నిటారుగా లేపి ఉంచాలి. నడుముపై భాగం వంచుతూ ముందుకు వంగాలి. చేతులు నేలకు సమాంతరంగా రావాలి. మణికట్టు కాలివేళ్లపై ఉంచాలి. చూపుడు వేళ్లతో బొటనవేళ్లని పట్టుకుని ఇంకానే ముందుకు వంగాలి. ఇప్పుడు ముఖాన్ని మోకాళ్లపై ఉంచాలి. చివరగా సాధారణ స్థితికి వచ్చేటప్పుడు నిదానంగా ఆసనం వదలాలి
లాభాలు
ఈ ఆసనం ఉదర భాగాన్ని బలంగా చేస్తుంది. ఇవి చిన్న పిల్లలు పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం అజీర్తి, సయాటికా, డయాబెటిస్ సమస్యలకు చక్కటి పరిష్కారం ఇలా చేస్తే ఉదరభాగంలోని కొవ్వు కూడా కరుగుతుంది.
జాగ్రత్తలు
ఆసనం చేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. అలాగే కిందకు వంగినప్పుడు శ్వాస బయటికి తీయాలి.. పైకి లేచేటప్పుడు లోపలికి తీసుకోవాలి. చివరి స్థితిలో సాధారణ శ్వాసతీయాలి.
