
నో ట్‌బుక్‌ఎల్‌ఎం... స్టూడెంట్స్ నుంచి కంపెనీల సీఈవోల వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్. దీన్ని గూగుల్ తీసుకొచ్చింది. గతంలో కేవలం డెస్క్‌టాప్‌ల్లోనే వాడుకునే వీలుండేది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో వాడుకునేందుకు వీలుగా యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందంటే..
సాధారణంగా కోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు అందరికీ అర్థమయ్యే భాషలో ఉండవు. పైగా చాలా పేజీలు ఉంటాయి. అవన్నీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ.. నోట్‌బుక్‌ఎల్‌ఎంలో జడ్జిమెంట్ కాపీని అప్‌లోడ్ చేస్తే.. వెంటనే అందులోని ముఖ్యమైన విషయాలు చెప్పేస్తుంది. అలా కూడా అర్థం కాని వాళ్లకోసం మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. జడ్జిమెంట్ కాపీని మొత్తం చదివి.. ఈజీగా అర్థమయ్యేలా ఒక పాడ్‌కాస్ట్ తయారు చేసి ఆడియో ఫైల్ ఇస్తుంది. అది వింటే విషయం మొత్తం కొన్ని నిమిషాల్లోనే అర్థమైపోతుంది.
నోట్‌బుక్‌ఎల్‌ఎం అనేది జెమిని ఏఐ బేస్డ్ నోట్ టేకింగ్, రీసెర్చ్ అసిస్టెంట్ టూల్. దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు.
వెబ్‌పేజీ యూఆర్‌ఎల్‌లు , యూట్యూబ్ వీడియోలు, ఆడియో క్లిప్‌లు, వర్డ్ డాక్యుమెంట్, కాపీ చేసిన టెక్స్ట్.. ఇలా దేనితో ఫీడ్ చేసినా చెల్లాచెదురుగా ఉన్న ఐడియాలను, డేటాని క్రమ పద్ధతిలోకి మార్చి ఇస్తుంది. స్టూడెంట్ ఒక సబ్జెక్ట్‌కు సంబంధించిన అనేక క్లాస్‌లను విని, ప్రతిదానికీ నోట్స్ రాశాడు అనుకుందాం. వాటన్నింటినీ విడివిడిగా పరిశీలించడానికి చాలా టైం పడుతుంది. అవన్నీ నోట్‌బుక్‌ఎల్‌ఎంలో అప్‌లోడ్ చేస్తే వాటితో ఒక పాడ్‌కాస్ట్ తయారుచేసి ఇస్తుంది. అంతేకాదు.. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాట్ చేసి అడగొచ్చు. అది సమాధానాలు కూడా ఇస్తుంది. ఇందులో మైండ్ మ్యాప్ అనే ఫీచర్ కూడా ఉంది. అంటే ఇచ్చిన సోర్స్ ఆధారంగా మైండ్ మ్యాప్‌ని రెడీ చేసి ఇస్తుంది. నోట్‌బుక్‌ఎల్‌ఎంకు యూజర్ మాన్యువల్స్, మెడికల్ అనాలసిస్, నోట్‌బుక్స్.. ఇలా ఏదైనా ఇవ్వొచ్చు. అది క్షణాల్లో పాడ్‌కాస్ట్‌లా మార్చేస్తుంది. కావాలంటే స్టడీ గైడ్, ప్రశ్నలు–జవాబుల రూపంలో ఒక బ్రీఫ్ డాక్యుమెంట్‌ని తయారుచేసి ఇస్తుంది.