బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలపై టెక్ కంపెనీ గూగుల్‌లో పనిచేసే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వెంకటేష్ అనే ఉద్యోగి, తన ఆఫీస్ కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. అక్కడికి వెళ్ళడానికి ఏకంగా 45 నిమిషాలు పట్టిందని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు.
ఈ వీడియోలో వెంకటేష్ మాట్లాడుతూ... "నేను మా ఆఫీస్‌కు చాలా దగ్గరలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. రోజు ఉదయం 9 లేదా 10 నిమిషాల్లో ఆఫీస్‌కు వెళ్ళిపోతాను. కానీ ఈరోజు విపరీతమైన ట్రాఫిక్ వల్ల 45 నిమిషాలు పట్టింది. ఉదయం 10 గంటలకు ఇంటి నుండి బయలుదేరితే, ఆఫీస్‌కు వచ్చేసరికి 10:45 అయింది. భాయ్.. అసలు మనం కట్టే టాక్స్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి..? కొన్ని నెలల్లో నేను నా జీతం కంటే ఎక్కువ టాక్స్ కట్టాను. నాలాగే లక్షల మంది ఇంతే టాక్స్ కడుతున్నారు. అయినా సరే రోజు ఇలాంటి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం చాలా బాధగా, కోపంగా ఉంది." అని అన్నాడు. అలాగే ఈ వీడియోకు “ఎక్కువ పన్నులు కట్టి.. రోడ్డుపై నత్తనడక ప్రయాణాన్ని అనుభవిస్తున్నాం” అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.
సోషల్ మీడియాలో కామెంట్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఉద్యోగి మాటలతో వందకు వంద శాతం ఏకీభవిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ "ఇది బెంగళూరులో ప్రతి ఒక్కరూ రోజు చూసే నరకమే." అని అనగా.... మరొక యూజర్ "4 కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాలు పట్టడం అంటే ప్రయాణం కాదు.. అదొక శిక్ష!" అని అన్నారు.
ఇంకొక యూజర్ "ప్రజలు అంతంత టాక్సులు కడుతున్నా రోడ్లు, సదుపాయాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. అతని కోపంలో తప్పే లేదు." అని అన్నారు. చివరికి కొందరైతే "బెంగళూరుకు కేవలం ఫ్లైఓవర్లు కడితే సరిపోదు, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే పక్కా ప్లానింగ్ కావాలి. ఇలాంటి ఇబ్బందుల వల్లే అందరూ మళ్ళీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇవ్వమని అడుగుతున్నారు." అని అంటున్నారు.
