ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను తగ్గించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. సెబీ రూల్స్ ప్రకారం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలను పాటించేందుకే ఇలా చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిబంధన నుంచి ఉన్న మినహాయింపు గడువు ఆగస్టు 2026 నాటికి ముగియనుండటంతో.. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులను బట్టి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వ వాటాలను అమ్మేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. పబ్లిక్ ఫ్లోట్ పెరగడం ద్వారా ఈ బ్యాంకులకు మార్కెట్లో మంచి వాల్యుయేషన్ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం వాటాల తగ్గింపుతో సరిపెట్టకుండా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో విడత కన్సాలిడేషన్ అంటే బ్యాంకుల విలీనం.. ప్రైవేటీకరణకు సన్నాహాలు చేస్తోంది. దేశంలో కేవలం 3 నుంచి 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రమే ఉంచాలన్నది కేంద్రం లాంగ్ టర్మ్ టార్గెట్. గతంలోనే నీతి ఆయోగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులను ప్రైవేటీకరణ కోసం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం.. బ్యాంకుల ప్రైవేటీకరణ, మెర్జర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకింగ్ కంపెనీల చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. భౌగోళిక విస్తృతి, సాంకేతిక అనుకూలత, బిజినెస్ మిక్స్ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ కన్సాలిడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే IDBI బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ సుమారు రూ. 52వేల 878 కోట్ల వ్యయంతో 60.72 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ప్రక్షాళన చర్యలు ఊపందుకుంటున్నాయి.
మొత్తంగా చూస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయడం, మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా వాటాలను అమ్మటం, ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటీకరణ, వాటాల విక్రయ ప్రక్రియ బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టనుందో వేచి చూడాల్సిందే.
