కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ప్రభుత్వ భూమి బోర్డులు

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ప్రభుత్వ భూమి బోర్డులు
  •  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు సమీపానే ఏర్పాటు
  •  రికార్డుల్లో 388.5 ఎకరాలు.. సర్వేలో 343 మాత్రమే
  • మరో 45.5 ఎకరాల సర్కారు భూమి ఎవరి అధీనంలో 
  • ఉందో తేలుస్తున్న రెవెన్యూ యంత్రాంగం 

 

ములుగు/గజ్వేల్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ పర్యవేక్షణలో, మర్కూక్ తహసీల్దార్ సరిత ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం ఆదివారం గ్రామంలోని సర్వే నంబర్ 325 పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది.

ఈ క్రమంలో ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ అధికారులు బహిరంగ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. సదరు సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన రెవెన్యూ బృందం.. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా రంగంలోకి దిగినట్టు స్పష్టం చేసింది. ఎవరైనా సర్కారు స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించినా, అనధికారికంగా లావాదేవీలు సాగించినా సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ సమీపంలోనే  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం.. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 

గత రెవెన్యూ రికార్డుల లెక్కల ప్రకారం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388.5 ఎకరాల మేర  ప్రభుత్వ భూమి ఉండాలి. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కొద్దిరోజుల కిందట స్థానిక రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అనంతరం నిబంధనల ప్రకారం పక్కాగా ‘ఎంజాయ్‌‌మెంట్ సర్వే’ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రికార్డుల్లో నమోదైన 388.5 ఎకరాలకుగానూ క్షేత్రస్థాయిలో కేవలం 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు సర్వే అధికారులు అధికారికంగా గుర్తించారు. అంటే దాదాపు 45.5 ఎకరాల విలువైన సర్కారు భూమి రికార్డుల్లోంచి గల్లంతైనట్టు తేలింది. ఇంత భారీ మొత్తంలో భూమి వ్యత్యాసం రావడంతో అధికారులు సైతం విస్తుపోయారు. ఇన్నాళ్లూ ఈ 45.5 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరు అనుభవించారు? రికార్డులను ఏమైనా తారుమారు చేశారా? అనే కోణంలో రెవెన్యూ యంత్రాంగం లోతుగా ఆరా తీస్తున్నది. భూమి లెక్క తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతున్నది. 

సర్కారు భూముల్లో ప్రవేశిస్తే ఉపేక్షించం

సర్వే నంబర్ 325లోని కొంత స్థలాన్ని పలువురు రైతులు ఇప్పటికే తమ స్వాధీనంలోకి తీసుకొని సాగు చేసుకుంటున్నట్టు తాజా సర్వేలో భాగంగా అధికారులు గుర్తించారు. అయితే, సదరు భూములకు సంబంధించి వారి వద్ద ఎలాంటి హక్కు పత్రాలు, అనుమతులు లేవని తహసీల్దార్ సరిత స్పష్టం చేశారు. సరైన కాగితాలు లేకుండా సర్కారు భూముల్లోకి చొరబడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సర్వే నంబర్ 325 పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అని, ఇందులో ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోమని అధికారులు తేల్చిచెప్పారు. సరిహద్దులను పకడ్బందీగా నిర్ధారించి, ప్రతి గుంట భూమినీ ప్రభుత్వపరం చేసేందుకు కార్యాచరణ వేగవంతం చేశామన్నారు. ఎవరైనా హద్దు రాళ్లను కదిలించినా, రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.