ఫేస్‌బుక్, ఇన్‌స్టాకు మోడీ ప్రభుత్వం నోటీసులు

ఫేస్‌బుక్, ఇన్‌స్టాకు మోడీ ప్రభుత్వం నోటీసులు

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్స్ ఫేస్ బుక్, ఇన్‎స్టా‎గ్రామ్‎ల మాతృ సంస్థ మెటాకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, ఇన్‎స్టా‎గ్రామ్‎లలో కంటెంట్ ప్రమోషన్, కంటెంట్ రికమండేషన్ వ్యవస్థల అల్గారిథమ్‎ను తక్షణమే సమీక్షించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 10న మెటాకు అడ్వైజరీ జారీ చేసింది. 

యాజర్లను తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‎ను నియంత్రించాలని ఆదేశించింది. యూజర్లకు ఒకే విధమైన లేదా పరిమితమైన కథనాలకు మాత్రమే ప్రభావితం కాకుండా విశ్వసనీయమైన, విభిన్నమైన సమాచారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పబ్లిక్ ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లేదా గ్రాఫిక్స్ పాతవా లేదా ఎడిట్ చేసినవా అనే గందరగోళం లేకుండా వాటి ప్రామాణికత, తేదీ, స్థలం వంటి వివరాలను యూజర్లకు స్పష్టంగా తెలియజేయాలని తేల్చిచెప్పింది.  

సమాజంలో హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతికి భంగం కలిగించేలా ఉండే కంటెంట్‌పై నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించింది. పాత వీడియోలు, ఫొటోలను ప్రస్తుత సంఘటనలుగా చూపే కంటెంట్‌ను నివారించాలని సూచించింది. భారతీయ చట్టాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని మెటాకు తేల్చిచెప్పింది. 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను అందజేయాలని మెటాను ఆదేశించింది. కాగా, మెటా నేతృత్వంలోని ఫేస్ బుక్, ఇన్‎స్టా అల్గోరిథం ఒకే రకమైన సెలెక్టెడ్  కంటెంట్‎కే ప్రాధాన్యం ఇస్తోందని.. అన్ని కథనాలను మెటా సమానంగా ప్రచారం చేయడం లేదన్న ఆరోపణల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది.