ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..అన్నపూర్ణదేవిగా.. మంగళగౌరీ దేవి

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..అన్నపూర్ణదేవిగా.. మంగళగౌరీ దేవి

దేశ వ్యాప్తంగా ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.  తిరువూరులో వేంచేసిన గౌరీకేదారీశ్వర ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ( అక్టోబర్​ 17)న అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయం.. ఆ తల్లి  చల్లని చూపులకోసం భక్తులు  ఎదురు చూస్తుంటారు. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా  ఆశ్వయుజమాసంలో మొదటి తొమ్మిది రోజులు తిరువూరు గౌరీదేవి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శరమిస్తున్నారు. అమ్మవారిని  కొలిచినవారికి కోటిజన్మల పాపం  భస్మమవడమే కాకుండా పుణ్యం లభిస్తుందని వేద పండితులు అరిపిరాల అప్పయ్యశాస్త్రి తెలిపారు.

నిత్యం దేవాలయంలో శాస్త్రోక్తంగా   ఆలయ అర్చకులు అరిపిరాల శ్రీనివాస్​ ఆధ్వర్యంలో నిత్యం హోమాలు.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.  మహిళలచే కుంకుమ పూజలను యధావిథిగా మరో అర్చక స్వామి మణికంఠ నిర్వహిస్తున్నారు.  నిత్యం లలితా సహస్రనామ పారాయణం, విశేషమైన పూజలు జరుగుతున్నాయి. 

అమ్మవారి రూపాలు

  • మూడు కన్నులతో..  పదహారు చేతులతో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. పాముల కంకణాలతో.. నల్లని కంఠంతో, నల్లని వర్ణంతో కనిపించే తల్లి షోడశ భుజ దుర్గాదేవి
  •  ఎనిమిది చేతులతో మహిషి (ఎద్దు) తలమీద ఎక్కి బంగారు వర్ణంతో కనిపించే అమ్మ వనదుర్గాదేవి
  •  రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణంతో సర్వభూషణ శోభితంగా దర్శనం ఇచ్చే తల్లి రుద్రాంశ దుర్గాదేవి
  •  వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కి శూలినీ దుర్గాదేవి స్వరూపం
  • అష్ట భుజాలతో చంద్రరేఖను ధరించిన శిరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపం
  •  సింహ వాహనంతో జయదుర్గాదేవి
  • మెరుపు తీగ లాంటి బంగారు వర్ణ శరీర కాంతితో బంగారు పద్మం పై  ఆశీనురాలై ఇంద్రాది దేవతలందరిచేత స్తుతించబడే వింధ్యావాసిని
  •  దుర్గాదేవి స్వరూపంగా ఎర్రని శరీర వర్ణంతో కుడి చేత తర్జనీముద్రని, ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపంతో రిపుమారిణి దుర్గాదేవి స్వరూపం
  •  తెల్లని శరీర వర్ణంతో మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తూ కుడివైపు చేతుల్లో అభయముద్ర చక్రాలను ఎడమవైపు నడుంమీద ఒకచేతిని, మరో చేత శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగి జగన్మాత
  •  ఇలా శరన్నవరాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

 జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవీభాగవతం ద్వారా తెలుస్తోంది.