- మెయింటెనెన్స్ నిధుల్లో వింత రూల్స్
- వెయ్యి మంది ఉన్నా.. 251 మంది ఉన్నా ఒకే రకమైన గ్రాంట్
- స్లాబ్ విధానంతో పెద్ద స్కూళ్లకు తప్పని తిప్పలు
- సొంత డబ్బు ఖర్చుచేస్తున్న హెచ్‌ఎంలు, టీచర్లు
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల నిర్వహణకు ఇచ్చే గ్రాంట్ల పంపిణీలో ‘సమగ్ర శిక్ష’ అమలు చేస్తున్న నిధుల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా ఏ రంగంలోనైనా లబ్ధిదారుల సంఖ్య పెరిగితే నిధుల కేటాయింపు పెరగాలి. కానీ, మన రాష్ట్రంలోని స్కూళ్లలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి అందే తలసరి నిధులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ స్లాబ్ విధానం పెద్ద స్కూళ్ల పాలిట శాపంగా మారింది. వెయ్యి మంది ఉన్న స్కూల్‌కు, 251 మంది ఉన్న స్కూల్‌కు ఒకే రకమైన గ్రాంటు ఇస్తుండటం ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. దీంతో చాలా బడుల్లో నిధులు చాలక పారిశుధ్యం, సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి.
తలసరి లెక్కల్లో భారీ వ్యత్యాసం..
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 1 నుంచి 30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి -250 మంది ఉంటే రూ.50 వేలు ఇస్తున్నారు. అయితే, 251 నుంచి వెయ్యి మంది విద్యార్థులున్న స్కూళ్లకు కేవలం రూ.75 వేలు, వెయ్యి ఆపై ఉంటే లక్ష రూపాయల స్కూల్ గ్రాంటును సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్నారు. ఈ స్లాబ్ విధానంతో విద్యార్థికి అందే వాటాలో దారుణమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
ఉదాహరణకు 32 మంది ఉన్న బడికి రూ.25 వేలు ఇస్తే.. ఒక్కో విద్యార్థికి రూ.806 పడుతుంది. అదే వంద మంది ఉన్న బడికి కూడా రూ.25 వేలే ఇస్తే.. అక్కడ ఒక్కో విద్యార్థికి వచ్చేది కేవలం రూ.250 మాత్రమే. ఇక వెయ్యి మంది విద్యార్థులున్న పెద్ద హైస్కూళ్లకు వచ్చే రూ.75 వేలను లెక్కిస్తే.. ఒక్కో విద్యార్థి వాటా కేవలం రూ.75కే పరిమితమవుతోంది. అంటే చిన్న బడి పిల్లవాడిపై పెట్టే ఖర్చులో పదో వంతు కూడా పెద్ద బడి పిల్లవాడికి అందడం లేదు.
పెద్ద బడుల్లో నిధుల కటకట..
వందలాది మంది విద్యార్థులుండే హైస్కూళ్లలో అవసరాలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. టాయిలెట్ల క్లీనింగ్, విద్యుత్ బిల్లులు, చిన్నపాటి రిపేర్లు, చాక్‌పీసులు, రిజిస్టర్లు వంటి వాటికి నెలకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతాయి. ప్రభుత్వం ఇచ్చే రూ.75 వేలు కేవలం నాలుగైదు నెలలకే ఖర్చయిపోతున్నాయి. మిగిలిన కాలం స్కూలు నడపడానికి హెచ్‌ఎంలు, టీచర్లు తమ జేబుల్లోంచి పెట్టుకోవడమో లేదా దాతల కోసం వెతకడమో చేయాల్సి వస్తోంది.
నిధులు చాలక పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేక చాలా చోట్ల టాయిలెట్లు అధ్వానంగా మారుతున్నాయి. మరోవైపు తక్కువ మంది పిల్లలున్న చిన్న బడుల్లో మాత్రం గ్రాంట్లు ఏం చేయాలో తెలియక అనవసర ఖర్చులు చూపిస్తున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
పరిష్కారం ‘తలసరి’ నిధులే..
ఈ అసంబద్ధమైన స్లాబ్ విధానాన్ని రద్దు చేసి, విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ‘పర్ చైల్డ్’ (ప్రతి విద్యార్థికి ఇంత అని) రేషియో ప్రకారం గ్రాంట్లు ఇవ్వాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి స్కూల్‌కు కనీస గ్రాంట్‌గా రూ.10 వేలు కేటాయించి, ఆపై పెరిగే ప్రతి విద్యార్థికి ఒక నిర్ణీత మొత్తాన్ని అదనంగా జోడించాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు అందుతాయని, అన్ని బడులకు న్యాయం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
