Beauty Tips : మీ తెల్ల జుట్టును.. వంటింటి చిట్కాలతో ఇలా నల్లగా మార్చుకోవచ్చు.. కలర్స్ వాడి జుట్టు పాడుచేసుకోవద్దు

Beauty Tips : మీ తెల్ల జుట్టును.. వంటింటి చిట్కాలతో ఇలా నల్లగా మార్చుకోవచ్చు.. కలర్స్ వాడి జుట్టు పాడుచేసుకోవద్దు

నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజమే. కానీ, ఈ జనరేషన్​లో  చిన్న వయసుకే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. జీన్స్ వల్లనే కాకుండా తినేవాటిలో ప్రొటీన్​, కాపర్ లోపం, హార్మోన్ల అసమతుల్యత లాంటివన్ని తెల్లవెంట్రుకల సమస్యకు దారితీస్తున్నాయి. తెల్లజుట్టుని నల్లగా మార్చడానికి మన వంటింట్లోనే బెస్ట్ ట్రీట్ మెంట్ ఉంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజపద్ధతిలో చేసే ఈ ట్రీట్​ మెంట్​వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి.. ఇప్పడు వేటితో ఎలా తయారు చేసుకొని జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

ఈ సమస్య నుంచి బయటపడడం పెద్దపనే. అందుకే వేలు ఖర్చు పెట్టి హెయిర్ కలరింగ్ చేయించుకుంటారు కొందరు. మరికొందరేమో ఏవేవో హెయిర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. కానీ వాటిల్లోని కెమికల్స్ జుట్టు కుదుళ్లని బలహీన పరిచి సమస్యను తీవ్రతరం చేస్తాయి. అందుకే ఈ సమస్యకు సహజ పద్ధతిలోనే చెక్ పెట్టాలి. 

ఉల్లిపాయలతో.. తయారీకి కావలసినవి

  • ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు 
  • నీళ్లు -కావాల్సినంత

తయారీ విధానం:  ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని 20నిమిషాల పాటు నీళ్లలో ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా ఉడికించడం వల్ల ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలన్నీ నీళ్లతో చేరతాయి. అందుకే ఆ నీటిని చల్లార్చి వడకట్టి జుట్టుకు, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం.. చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు... అంతేకాదు ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టుకుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. దాంతో తెల్లవెంట్రుకలు నల్లగా మారడంతో పాటు రీ గ్రోత్ అవడానికి కూడా సహా యపడుతుంది.

గోరింటాకుతో... తయారీకి కావలసినవి

  • మెత్తగా రుబ్బిన గోరంటాకు- 10 గ్రాములు 
  • కాఫీపొడి- 3 గ్రాములు 
  • పెరుగు - 25 గ్రాములు 
  • నిమ్మరసం- నాలుగు టీ స్పూన్లు 
  • బ్రహ్మీపొడి- 10గ్రాములు 
  • ఉసిరి పొడి - 10 గ్రాములు

తయారీ విధానం:  ఒక గిన్నెలో గోరింటాకు కాఫీపొడి, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని
వెంట్రుకలకు, కుదుళ్లకు పట్టించాలి. అరగంట పాటు అలానేఉంచి చల్లటి నీటితో శుభ్రంచేసుకోవాలి. ఆతర్వాత రోజు గోరు వెచ్చని నీళ్లతో గాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి మూడు నెలల పాటు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.

కరివేపాకుతో ...తయారీకి కావాల్సినవి

  • కరివేపాకు పేస్ట్-అరకప్పు
  • పెరుగు - ఒక కప్పు 
  • ఆల్మండ్ ఆయిల్-ఒక టేబుల్ స్పూన్
  •  గోరు వెచ్చని నీళ్లు- తగినన్ని

 తయారీ విధానం:  కరివేపాకును శుభ్రంగా కడిగి పేస్ట్ చేయాలి. అందులో ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ,ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా కలిపి తలకు ప్యాక్​ లా రాసుకోవాలి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీళ్లతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. జుట్టుని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్​ పెట్టుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు తగ్గడమేకాకుండా జుట్టు నిగారింపు పెరుగుతుంది.

ఆలుగడ్డ రసంతో .. తయారీకి కావలసినవి

  • బంగాళాదుంప రసం- మూడు టీ స్పూన్లు
  •  గుడ్డులోని తెల్లసొన -రెండు టేబుల్ స్పూన్లు
  • పెరుగు -టీ స్పూన్

తయారీ విధానం: ఆలుగడ్డను తురిమి ఒక పల్చటి క్లాత్​ లో వేసి పిండి రసం తీయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అలుగడ్డ రసం, గుడ్డు సొన, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 10నుంచి15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువ ఉన్నదే ఎంచుకోవాలి. వారానికి మూడు సార్లు మూడు నెలల పాటు ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.

ఆలుగడ్డ తొక్కతో..కావలసినవి

  • అలుగడ్డ తొక్క- ఒక కప్పు
  • నీళ్లు-రెండు కప్పులు 
  • రోజ్ వాటర్- 3లేదా4 చుక్కలు

తయారీ విధానం:  ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి వాటిపై తొక్క తీయాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లలో అలుగడ్డ తొక్కని వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టాలి.. శుభ్రంగా తలస్నానం చేసి తర్వాత నీటిలో రోజ్ వాటర్ లేదా లావెండర్ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. మిశ్రమాన్ని వెంట్రుకలకుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలి. అతర్వాత జుట్టుని ఆరనివ్వాలి ఇలా వారం రోజులు చేస్తే తెల్లని వెంట్రుకలు నలుపు రంగులోకి మారతాయి. మిశ్రమం  జుట్టుకి పట్టించిన తర్వాత శుభ్రం చెయొద్దు.

గుడ్డు తెల్లసొనతో.. కావలసినవి

  • గుడ్డు తెల్లసొన-రెండు కప్పులు 
  • ఉసిరి కాయలు-ఒక కప్పు 
  • నీళ్లు- నాలుగు కప్పులు 
  • పంచదార- చిటికెడు 
  • హెన్నా-రెండు కప్పులు
  •  నిమ్మరసం - ఒక టీ స్పూన్

తయారీ విధానం: ఉసిరికాయలను నీళ్లలో వేసి పంచదార వేసి మరిగించాలి. ఈ మిశ్రమంలోని నీళ్లు ఓ కప్పు వరకు ఇంకేలా మరగబెట్టి చల్లార్చి వడకట్టాలి. ఇప్పుడు ఇందులో హెన్నా పొడి, గుడ్డు సొన, నిమ్మరసం కలపి తలకు పట్టించాలి. రెండు గంటల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది.. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటుంది. 

వాల్​నట్స్ తో.. తయారీకి కావలసినవి

  • వాల్​ నట్స్–  మూడు టేబుల్ స్పూన్లు 
  • కాటన్ బాల్స్- కావాల్సినన్ని

తయారీ విధానం: వాల్​ నట్స్​ ను అరగంట సేపు నీటిలో మరిగించాలి. అవి చల్లారిన  తర్వాత కాటన్ సాయంతో జుట్టుకు కుదుళ్లకు పట్టించాలి. ఓ అరగంట తర్వాత తలస్నానంచేస్తే చాలు ఇలా వారానికి రెండు సార్లు.. మూడు నెలల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే జుట్టుకు రాసుకునేటప్పుడు చర్మం మీద పదకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. . 

మరికొన్ని చిట్కాలు

 

  • ఎండబెట్టిన ఉసిరి పొడి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్ల జుట్టు నల్లబడుతంది. 
  • కొబ్బరినూనెలో కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి
  •  కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి ప్రతిరోజూ తలకు పట్టిస్తుంటే చుండ్ర సమస్య తగ్గడంతోపాటు జుట్టు నల్లబడుతుంది.
  • మల్లె తీగ వేళ్లని నిమ్మరసంలో కలిపి గ్రైండ్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.