Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెరీర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా వరుస గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న హార్దిక్.. వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలవడంపై సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 11న 33వ పడిలోకి అడుగుపెట్టనున్న హార్దిక్ పాండ్యా.. వరల్డ్ కప్ రేస్‌లో నిలవాలంటే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో పాటు బౌలింగ్ వర్క్‌లోడ్‌ను బాగా పెంచుకోవాలని భారత మాజీ ట్రైనర్ రామ్‌జీ శ్రీనివాసన్ (Ramji Srinivasan) హెచ్చరించారు.
హార్దిక్ పాండ్యాకు ట్రైనర్ వార్నింగ్:
హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ఆడాలంటే కేవలం నైపుణ్యం సరిపోదని, ఫిట్‌నెస్ అత్యంత కీలకమని రామ్‌జీ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అతను వరల్డ్ కప్‌లో ఆడాలంటే మ్యాచ్‌లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయగలగాలి.. ఆ సామర్థ్యం రావాలంటే ప్రాక్టీస్‌లో 15 నుంచి 20 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆటగాడి నైపుణ్యం, ఫిట్‌నెస్, బలం, రికవరీ ప్రోటోకాల్స్, పోషకాహారం, మానసిక స్థితి అన్నీ నైపుణ్యానికి తగినట్లుగా రూపుదిద్దుకోవాలి తప్ప, మరోలా ఉండకూడదని తేల్చిచెప్పారు.
గాయాలతో ఆటకు దూరం:
2026 మే నెలలో జరిగిన ఐపీఎల్ సమయంలో వెన్నునొప్పి (Back spasms)తో బాధపడిన హార్దిక్.. ఆ తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న సమయంలో క్వాడ్రిసెప్స్, షిన్ (కాలి పిలక కండరాలు) గాయాలపాలయ్యాడు. ఇక మార్చి 2025లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హార్దిక్ ఒక్క వన్డే అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల ఆస్ట్రేలియా 'ఏ'తో జరగాల్సిన వన్డే సిరీస్ కోసం భారత్ 'ఏ' జట్టులో ఎంపికైనప్పటికీ.. బౌలింగ్ చేసే సమయంలో నొప్పి తిరగబెట్టడంతో ఆ సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో అతని రీఎంట్రీ మరింత ఆలస్యమైంది.
ALSO READ : కాసేపట్లో భారత్ vs వెస్టిండీస్ రెండో టీ20..
సీనియర్ల నుంచి స్ఫూర్తి పొందాలి:
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన రామ్‌జీ శ్రీనివాసన్.. హార్దిక్ పాండ్యాకు పలువురు సీనియర్ పేసర్లని ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తీవ్రమైన గాయాల నుంచి కోలుకుని అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చిన జహీర్ ఖాన్, ఎల్. బాలాజీ, ఆశిష్ నెహ్రా లాంటి ప్లేయర్స్ తో హార్దిక్ మాట్లాడాలని సూచించారు. వారు తమ ఫిట్‌నెస్ ప్రోటోకాల్స్‌ను ఎలా సెట్ చేసుకున్నారో తెలుసుకుని, దాన్ని అనుసరించాలని చెప్పాడు. వరల్డ్ కప్ నాటికి హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి దిగుతాడని ఆశిస్తున్నట్లు ట్రైనర్ శ్రీనివాసన్ తెలిపారు.
