ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్.. జగన్నాథుడి విగ్రహం కోసం చెప్పులు తీసేసిన హార్దిక్.. వీడియో వైరల్!

ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్.. జగన్నాథుడి విగ్రహం కోసం చెప్పులు తీసేసిన హార్దిక్.. వీడియో వైరల్!

Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టేడియంలోనే కాకుండా మైదానం బయట కూడా అభిమానుల హృదయాలను గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హార్ట్-టచింగ్ వీడియో హార్దిక్ తీరు మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకి టచ్ అయ్యేలా చేసింది. ఒక వీరాభిమాని అందించిన జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీసుకునే ముందు హార్దిక్ తన పాదరక్షలను (Footwear) విడిచి పెట్టి, భక్తితో స్వీకరించిన తీరు ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్: 
ఈ అద్భుతమైన కలయిక వెనుక ఆ అభిమాని పడిన కష్టం, అంకితభావం నిజంగా అమోఘం. అతడు కేవలం భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కలవాలనే బలమైన కోరికతో.. పవిత్రమైన జగన్నాథుని విగ్రహాన్ని పాండ్యాకు స్వయంగా బహుమతిగా ఇవ్వడం కోసం ఒడిశా నుంచి సైకిల్‌పై ప్రయాణించి వచ్చాడు. ఎట్టకేలకు హార్దిక్ ని కలిసిన ఆ ఫ్యాన్.. ఎంతో భక్తిభావంతో ఆ పవిత్రమైన విగ్రహాన్ని హార్దిక్‌ పాండ్యాకు అందించాడు.  

చెప్పులు వదిలిపెట్టి.. చేతిలోకి స్వామి విగ్రహం:  
ఆ అభిమాని చేతిలో ఉన్నది జగన్నాథ స్వామి విగ్రహం అని గ్రహించిన వెంటనే హార్దిక్ పాండ్యా ఒక్క క్షణం ఆగాడు. దేవుడి పట్ల ఇష్టం, సదరు అభిమాని తెచ్చిన కానుక పట్ల అత్యంత గౌరవంతో.. వెంటనే తన కాళ్లకు ఉన్న పాదరక్షలను పక్కకు తొలగించాడు. ఆ తర్వాత రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ పవిత్ర విగ్రహాన్ని ఎంతో జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా, అంత దూరం సైకిల్‌పై ప్రయాణించి వచ్చిన ఆ అభిమానిని హార్దిక్ అభినందించాడు. అక్కడ ఉన్నవారంతా పాండ్యా చేసిన ఈ పనికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.

సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు: 
ఈ గుండెకు హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ, హిందూ మతపరమైన సెంటిమెంట్స్‌ను కాపాడుతూ హార్దిక్ ప్రదర్శించిన ఈ చిన్న ప్రవర్తన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ ఇంతటి వినయం ప్రదర్శించడం నిజంగా గొప్ప విషయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.