- బొగ్గు నిల్వ చేయలే.. కరెంట్ కొనలే
- కరువు మండలాలు ప్రకటించి.. పరిహారం ఇయ్యాలే
గజ్వేల్/ ములుగు: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతోనే కరువు పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు పది నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను 24 గంటలు నడపకుండా సాగునీటి కొరత సృష్టించారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని సమ్మక్క బ్యారేజీ వద్ద 10 మోటార్లకు ఏడు, ఎనిమిది మోటార్లనే రోజుకు ఎనిమిది గంటలు నడుపుతున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు నీటిని తరలించుకుపోయారని ఆరోపించారు.
రైతులను ఆదుకోవాలె..
రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన 12 లక్షల ఎకరాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు సాయం అందించాలన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.5 వేల సాయం ప్రకటించారని, ఏపీలో కరువు మండలాలను గుర్తించారని తెలిపారు. కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను 24 గంటలూ నడిపించి, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తే మరో 20 రోజుల పాటు 10 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుకోవచ్చన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
