సరాక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: హరీష్ రావు

సరాక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని సరాక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. శుక్రవారం ( అక్టోబర్ 23 ) బాధితులను పరామర్శించిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. సరాక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు కార్మికులు చనిపోవడం తీవ్ర విషాదకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు హరీష్ రావు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు హరీష్ రావు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం... గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా అని ప్రశ్నించారు హరీష్ రావు. 

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటోందని...  పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని అన్నారు హరీష్ రావు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు మీరు చేస్తున్నదేమిటని అన్నారు.

భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడని ప్రశ్నించారు హరీష్ రావు. సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని... ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు హరీష్ రావు. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలని అన్నారు హరీష్ రావు.