హైదరాబాద్: గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరుతో తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పోలవరం నుంచి కావేరి అనుసంధానం పేరుతో తెలంగాణకు నీటి వాటా దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాలను వదులుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
నవంబర్ 3న జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సమావేశంలో గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టును అజెండాలో చేర్చడంపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన వెంటనే ప్రాజెక్టును అజెండాలో చేర్చారని చెప్పారు. చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగించి గోదావరి జలాలను తరలించే కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారని ఆరోపించారు.
గతంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని హరీశ్ రావు గుర్తుచేశారు. గోదావరి జలాలను తెలంగాణకు ప్రయోజనం చేకూర్చేలా వినియోగించాలంటే ఇచ్చంపల్లి నుంచి లింక్ ప్రాజెక్టు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కూడా హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం నమోదైనా అక్కడ కరువు పరిస్థితులు, పంటల విరామం వంటి సమస్యలు లేవని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డే కారణమని విమర్శిస్తూ..ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యానించారు.
దేవాదుల ప్రాజెక్టులో రెండు మోటార్లను ఎందుకు నడిపించలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. గతంలోనే మోటార్లను నడిపించి నీటిని ఎత్తిపోసి ఉంటే ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండేవన్నారు. సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల వినియోగం, నదుల అనుసంధాన ప్రతిపాదనలు, రాష్ట్రంలో సాగునీటి కొరత అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని హరీశ్ రావు కోరారు.
