- పోలవరం నుంచి నీటిని తీసుకెళ్లాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు: హరీశ్‌రావు
- సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ నోరు మెదపట్లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి లింక్ పేరుతో తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాల్సిన సీఎం రేవం త్‌రెడ్డి మాత్రం నోరు మెదపట్లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి– కావేరి లింక్‌ను ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచే చేపట్టాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని, జీసీ లింక్‌లో తెలంగాణను పూర్తిగా బైపాస్చేసి 150 టీఎంసీలను బొల్లపల్లిలో నింపుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం– బనకచర్ల, పోలవరం –నల్లమలసాగర్ ప్రతిపాదనలు ఫెయిల్‌కావడంతో ఇప్పుడు జీసీ లింక్ ముసుగులో ఏపీ కొత్త డ్రామాకు తెరదీసిందన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గరున్న ఎంపీలను చూసి కేంద్రం భయపడుతోందా..? అని హరీశ్‌రావు నిలదీశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని కేంద్రం.. తెలంగాణకు నష్టం చేసే ఏపీ ప్రతిపాదనలను ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు.
‘‘సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతున్నడు. గురుదక్షిణ అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది అంతకుమించిన జాతిద్రోహం. భవిష్యత్ తరాలు నిన్ను క్షమించవు’’ అని హెచ్చరించారు. చత్తీస్‌గఢ్ వాడుకోని 148 టీఎంసీల మిగులు జలాల ఆధారంగా ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్వాటర్డెవలప్మెంట్ఏజెన్సీ) గోదావరి–కావేరి లింక్‌ను ప్రతిపాదించిందని గుర్తుచేశారు.
కేంద్రం లెక్కల ప్రకారం ఈ 148 టీఎంసీల్లో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, కర్నాటకకు 16, పుదుచ్చేరికి 2.5 టీఎంసీలు రావాల్సి ఉంటుందని, ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా లింక్ చేపడితే ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 2,38,236 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కర్నాటకను ఒప్పించేందుకు ఎగువన ఆల్మట్టిలో 16 టీఎంసీలు ఆపుకోమని ఆఫర్ ఇస్తున్నారని, అటు ఆల్మట్టిలో 16, ఇటు పోలవరంలో 21 కలిపి 37 టీఎంసీలు కృష్ణాలో తగ్గితే పాలమూరు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
