పొయెట్రీ కార్నర్: హార్మోజ్ హోరు

పొయెట్రీ కార్నర్:  హార్మోజ్ హోరు

మండుతున్న చమురు దేశాల వాకిలిలో
రొమ్ము విర్చుకున్న ఒంటరి ధిక్కారం 
విర్రవీగే తెల్లని అహంకారాన్ని
పేలవమైన శతఘ్నిగా మార్చింది  
తరాలు మారినా తరగని పోరాట కాంక్ష 
చమురు బావుల ఊటలుగా
ఊరుతుంటే 
రక్త పిపాసి దాహగీతి
రాబందు నీడగా వెన్నాడుతున్నది 
డాలర్ తీపికి రుచి మరిగిన దేశాలు
విధేయతలోనే పరిగెలేరుకుంటున్నయి  
వెన్ను వంచని రాజ్యమే
ఇరా‘నియ్యత్​గా’ ఇరాం లేకుండ కొట్లాడుతయి
పంటి కింది రాయిలా మారుతయి 
రక్త మాంసాలతో నిలబెట్టుకున్న చరిత్ర  
మధ్యలో మడిచిన పేజీ కాదు 
అది ఖండాంతరాలు దాటిన కీర్తి పతాక
అల్లుకొన్న జీవ ఇంధన నాడుల సంధి
హోర్ముజ్  హోరుగా 
నేలంతా పర్చుకున్నది
గ్యాస్ ఆవిరిలే  ఊపిరిగా
నిరంతర తరంగా  వాయిలీనంగా...
విశాల సముద్రంపై తేలియాడుతున్న సుగంధ ద్రవ్యాల తివాచి 
సాఫ్రాన్ మేఘంలా కమ్ముకొన్నది
ఏ దినుసుకు ఆ దినుసు ఏ కమ్మటి రుచిని అందించునో
ఇమానంగా నీకే తెలుసు
కొత్త నాగరికత నవనాడులు నీ నుండే పరుగు తీశాయి
ఛాయ్ బన్ను తిని బతకవచ్చనే పేదల జిద్ది
చక్రాలను పరుగు పెట్టించింది
ఎన్ని సార్లు తిన్న మోహం మొత్తని లోక ప్రియం బిర్యాని 
ఆశలను చిగురించింది
అవి మెతుకులే కావచ్చు
బంగారు రంగు కాంతిగా పళ్లెములోకి అందించింది
ఎన్ని ఇచ్చినా రుణపాశం లేని భుక్తాయాసం 
ప్రపంచాన్ని పీడిస్తున్నది మానవత లేని నీతిగా...
మారణకాండయే తన చిరునామాగా మార్చుకున్న అగ్ర రాజ్యం
చమురును గుత్తకు పట్టింది
తలంటు తన తైలంతోనే అని సిగపట్టు పట్టింది
బేరసారం లేకుండనే దేశం మెడలో దివాలా గంట
వెలగని పొయ్యిలో బూడిద 
ఆకలి తీర్చదు ఆగ్రహావేశాన్ని ఆర్పదు

 బి. వేణుగోపాల్ రెడ్డి

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.