దేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరుగుతున్న వేళ క్రెడిట్ కార్డుల వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీలో దూకుడు ప్రదర్శిస్తోంది. సెప్టెంబర్ నుంచి 3 నెలల కాలంలో 14 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసింది. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 19 శాతం అధికం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్న ఖర్చులు నెలవారీగా సగటున రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంటున్నాయి. ఇందులో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లే నెలకు దాదాపు రూ. 61వేల 435 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డ్ ఖర్చుల్లో దాదాపు 30.3 శాతం వాటా ఒక్క హెచ్డీఎఫ్సీ చేతిలోనే ఉంది. జూలై నాటికి దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య ఏకంగా 12కోట్ల 29లక్షలకు చేరుకుంది.
ఈ లెక్కలు దేశంలో డిజిటల్ లావాదేవిల వృద్ధిని మాత్రమే కాకుండా.. ఆధునిక లైఫ్ స్టైల్ కోసం ప్రజలు క్రెడిట్ కార్డులపై ఏ విధంగా ఆధారపడుతున్నారో స్పష్టం చేస్తున్నాయి. నేడు సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి చిన్న అవసరానికి, షాపింగ్‌కు, ఈఎంఐల కోసం క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా పర్వాలేదనే ధోరణి పెరగడంతో.. అనేక మంది తెలియకుండానే అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. నెలవారీ జీతాలు సరిపోక, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
బ్యాంకులు దూకుడుగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తుండటం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తాత్కాలికంగా పెరుగుతున్నప్పటికీ.. ఇది దీర్ఘకాలంలో అప్పులు చేస్తున్న ఫ్యామిలీల బడ్జెట్‌ను తలక్రిందులు చేసే ప్రమాదం ఉంది. ఒకవైపు బ్యాంకులు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న వేళ, మరోవైపు వినియోగదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఆర్థిక నియంత్రణ పాటించడం కీలకమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
