- కలెక్టరేట్ల ఎదుట మూడు రోజులుగా నిరవధిక సమ్మె
- ఏడు రాష్ర్టాల్లో మాదిరిగా రెగ్యులరైజేషన్ కోసం డిమాండ్
- తెలంగాణలో 17 వేల మంది, 78 విభాగాల్లో సేవలు
మంచిర్యాల, వెలుగు : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఎంప్లాయీస్ తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట మూడు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న తమను ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కేడర్ఫిక్సేషన్ చేసి వంద శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగడంతో వైద్య ఆరోగ్యశాఖలో వారందించే పలు సేవలు స్తంభించాయి. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ జేఏసీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఏండ్లుగా అరకొర జీతాలతో...
వైద్య ఆరోగ్య శాఖలో వివిధ రకాల సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టింది. ఎన్హెచ్ఎం కింద రాష్ర్టవ్యాప్తంగా 17 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెల్త్ సబ్ సెంటర్ల నుంచి జిల్లా హాస్పిటల్స్ వరకు 78 కేటగిరీల్లో సేవలందిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ స్కీమ్‌లో పనిచేస్తున్న వారికి అరకొర జీతాలు మాత్రమే అందుతున్నాయి.
ఏండ్లు గడుస్తున్నా వేతనాలు పెరగకపోగా, గతంలో ఉన్న కాంట్రాక్ట్ సిస్టమ్‌ను తొలగించి ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడంతో ఉద్యోగుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూడడం సర్వసాధారణం అయిపోయింది.
విస్తృతమైన సేవలందిస్తూ...
వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు రెగ్యులర్ ఎంప్లాయీస్‌తో సమానంగా విస్తృతమైన సేవలందిస్తున్నారు. బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్, హైరిస్క్ డెలివరీలు తదితర కార్యక్రమాల అమలులో ముందున్నది వీళ్లే. రాష్ర్టంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డెలివరీలు 31 శాతం నుంచి 70 శాతానికి పెరగడంలో, మాతా శిశు మరణాలు 25 శాతం నుంచి 19 శాతానికి తగ్గడంలో, శిశు మరణాల రేటు 15 శాతం నుంచి 5 శాతానికి దించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల కృషి ఎంతో ఉన్నది. కంటి వెలుగు, టీబీ నిర్మూలన, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, ఆరోగ్య మహిళ, చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు వంటి ప్రోగ్రామ్స్ సక్సెస్‌లో భాగమయ్యారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లు ఇవీ...
- ఎన్హెచ్ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్.
- హర్యానా, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాలు వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేయాలి.
- సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం క్యాడర్ ఫిక్సేషన్ చేసి వంద శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి.
- ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్ట్‌నుంచి ఔట్‌సోర్సింగ్‌కు బదిలీ చేస్తూ జారీ చేసిన జీవో 1195ను పున:పరిశీలించాలి. ఔట్సోర్సింగ్ఏజెన్సీలను రద్దు చేసి ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరినీ స్టేట్హెల్త్సొసైటీ (ఎస్హెచ్ఎస్)లోనే కొనసాగించాలి.
- ప్రతినెలా 5 లోపు జీతాలు చెల్లించాలి.
- 2022 నుంచి పెండింగ్ ఉన్న 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ అందించాలి.
- మహిళా ఉద్యోగులకు కేడర్‌తో సంబంధం లేకుండా 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి.
- మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఫ్యామిలీలో ఒకరికి జాబ్ఇవ్వాలి.
