కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ( అక్టోబర్ 16 ) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా తిరుమలకు భారీగా తరలి వచ్చారు భక్తులు. ఈ క్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండ మీద కోలాహలం నెలకొంది.
ఇవాళ రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి కోసం నిరీక్షిస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులలో ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు. స్వామివారి గరుడసేవను కనులారా వీక్షించాలన్న భక్తుల సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు భారీ వర్షం కురుస్తుండటంతో భక్తుల భద్రత, మాడవీధుల్లో రద్దీ నియంత్రణ, దర్శన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించారు..
