బంగాళాఖాతంలో అల్పపీడనం : తూర్పు, ఉత్తర తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : తూర్పు, ఉత్తర తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 24 గంటల్లో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఎల్లో అలర్ట్..

హైదరాబాద్ నగరంలో ఈరోజు(సెప్టెంబర్ 13) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 14, 15) నగరంలో భారీ వర్షాలు పడుతాయని వివరించింది. ఈ రెండు రోజులు(సెప్టెంబర్ 14, 15) హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

భారీ వర్షాలు..

రాష్ట్రంలో తూర్పు, ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ(సెప్టెంబర్ 13) 7 జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్,  మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. 

రేపు(సెప్టెంబర్ 14) కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు అదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఉరుములు, మెరుపులు..

రాగల మూడు రోజులు(సెప్టెంబర్ 14, 15 ,16) రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని మత్స్య కారులు చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.