సర్దార్ 2 షూట్ లోడింగ్ .. వీడియో షేర్ చేసిన హీరో కార్తి

సర్దార్ 2 షూట్ లోడింగ్ .. వీడియో షేర్ చేసిన హీరో కార్తి

గత ఏడాది ( 2022 అక్టోబర్ 21న) కార్తి(Karthi) హీరోగా నటించిన సర్దార్ మూవీ తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది. స్పై థ్రిల్ల‌ర్‌ లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయి..నేటితో ఏడాది పూర్తి అయిన సందర్భంగా..అభిమానులకు కార్తీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ సీక్వెల్ గా సర్దార్2(Sardar2) త్వరలో లోడ్ అవుతోంది అంటూ..ట్విట్టర్ నుంచి స్పెషల్ వీడియోను షేర్ చేశారు. దీంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్‌ గా వచ్చిన ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్స్ లో నటించారు. పోలీస్ గా, దేశ రక్షణ కోసం పోరాడే సీక్రెట్ ఏజెంట్ గా నటించి సక్సెస్ అందుకున్నారు. ‘‘ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే’’ అంటూ సర్దార్‌ కొడుకు పాత్ర.. రా ఏజెంట్‌గా ఎంపికవ్వడాన్ని గతంలో మేకర్స్  ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అతని తర్వాతి మిషన్‌ కంబోడియాలో జరగనుందని సమాచారం. 

డైరెక్టర్ పి.ఎస్‌.మిత్ర‌న్‌ తెరకెక్కించిన సర్దార్ మూవీని మంచి సామాజిక సందేశంతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో సర్దార్ 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ పి.ఎస్‌.మిత్ర‌న్‌  త‌న క‌థ‌ల‌తో ప్రస్తుత అంశాల్ని, సామాజికాంశాల్ని  స్పృశించ‌డంలో దిట్ట.విశాల్ హీరోగా వచ్చిన అభిమ‌న్యుడు, శివ కార్తికేయన్ తో హీరో మూవీస్ తో..తెలుగు ప్రేక్ష‌కులకి దగ్గరయ్యారు. 

సర్దార్ కథ విషయానికి వస్తే..

స‌మ‌స్త జీవ‌కోటి ప్రాణ‌ధారమైన నీటి  నిర్వ‌హ‌ణ మొత్తం..ప్రైవేటీక‌ర‌ణ చేయడం వల్ల..నీటిని ఎలా కలుషితం చేస్తున్నారో..వాటర్ బాటిల్స్ వినియోగం వల్ల ఎంతటి ప్రమాదం నెలకొందో.. చక్కగా చూపించారు. అలాగే ఈ అంశంతో పాటు..దేశ రక్షణలో భాగంగా పనిచేసే ఓ గూఢ‌చారికి దేశ ద్రోహి అనే ముద్ర పడటాన్ని చూపించిన తీరు ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

ఒక దేశం ఒక పైప్‌లైన్ పేరుతో కొంత‌మంది తమ వ్యాపార సామ్రాజ్యాలని బలపరుచుకొనుటకు నీటిని త‌మ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏం చేశారు?  దాని కోసం ఎక్క‌డో  అజ్ఞాతంలో, దేశ‌ద్రోహిగా అని ముద్ర‌ప‌డిన ఓ వ్య‌క్తి ఎలా బ‌య‌టికొచ్చి..ఆ స్వార్థ‌ప‌రుల ఎత్తుల్ని చిత్తు చేశాడ‌న్న‌ది కీలకంగా చూపించారు మిత్రన్. ప్రస్తుతం తీయబోయే సర్దార్ 2 లో డైరెక్టర్ ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడో చూడాలి మరి.