
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సూర్య షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇవి కాక కమల్ హాసన్ నిర్మించబోయే చిత్రంలో సూర్య హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. తను హీరోగా నటిస్తున్న చిత్రాలతో పాటు ఇతర హీరోలతోనూ వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు కమల్ హాసన్.
సిద్ధార్థ్ ‘చిన్నా’, విక్రమ్ ‘వీర ధీర శూరన్’ చిత్రాల దర్శకుడు యు.అరుణ్ కుమార్ డైరెక్షన్‌లో ఆయన ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో హీరోగా పలువురి పేర్లు వినిపించగా, తాజాగా సూర్యను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కమల్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నటించడం సూర్యకు ఇదే తొలిసారి కాదు.
గతంలో ఆయన నిర్మించిన ‘విక్రమ్’ చిత్రంలో ‘రోలెక్స్’గా అతిథిపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వెట్రిమారన్ డైరెక్షన్‌లోనూ సూర్య ఓ సినిమా చేయాల్సి ఉండగా.. ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.