ఈతరం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 10 మంది యువతలో 5 మందికి పైగానే అప్పుల తిప్పలు పడుతున్నారు. ఒక్కొక్కరివి వేరు వేరు అవసరాలు. బాధ్యతల బరువులు మోస్తూ అప్పులు చేస్తూ వాటిని తీర్చుతూ తిప్పలు పడుతున్నది కొందరైతే.. జల్సాలకు అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లు, సినిమాలు షికార్ల కోసం అప్పులు చేస్తున్నది మరికొందరు. బాధ్యతలను చక్కబెట్టేందుకు అప్పులు చేస్తూ వాటిని సకాలంలో తీర్చే వాళ్లతో ఎలాంటి సమస్య లేదు. వాళ్ల అప్పుల గురించి ఇళ్లలో కూడా తెలిసే ఉంటుంది. అప్పులు తీరిపోయాక పెళ్లి చేసుకుందామనే క్లారిటీతో ఉంటారు. కానీ.. మరికొందరు మాత్రం ఇంట్లో వాళ్ల దగ్గర వ్యక్తిగత అప్పుల గురించి దాచి పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి తర్వాత నమ్మి తన జీవితంలోకి వచ్చిన భార్యకు కూడా అప్పుల గురించి చెప్పరు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తుంటారు. లోన్ యాప్స్ అని, బ్యాంకు లోన్లు అని భార్యకు తెలియకుండా నానా తిప్పలు పడుతుంటారు. ఏదో ఒకరోజు భార్యకు నిజం తెలిసి నమ్మక ద్రోహం చేశారని ఆమె గుండె బద్ధలైపోతుంది. లక్షల్లో అప్పులు చేసి పెళ్లి తర్వాత కూడా భార్యకు తెలియకుండా మేనేజ్ చేస్తూ అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్న భర్తలు మన దేశంలో చాలా మందే ఉన్నారు.
అయితే.. ఇలా లక్షల అప్పులు పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకుని భార్య దగ్గర ఈ నిజం దాచడం తప్పా..? ఒప్పా..? అనే ప్రశ్నకు సైకాలిజిస్టులు కచ్చితంగా తప్పే అంటున్నారు. తన అప్పుల గురించి చెప్పి భార్యను కూడా బాధపెట్టడం ఎందుకని నిజం దాస్తున్నామని భర్త చెప్పినా అది కచ్చితంగా మోసమేనని సైకాలజిస్టులు చెబుతున్నారు. భార్యకు కోపం వస్తుందనో, భార్య ముందు మొఖం చెల్లకనో.. అప్పుల గురించి దాచి తప్పించుకునే తరహాలో భర్త ప్రవర్తించడం గురించి వినే ఉంటారు.
ALSO READ : రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నారా ?
ఇలా చేయడం వల్ల భార్యకు నమ్మకం పోతుందని.. ఇలాంటి విషయాలను ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటేనే సంసారం సాఫీగా సాగిపోతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అప్పు ఉండటం తప్పు కాదు. కానీ.. అప్పుల గురించి భార్య భర్త దగ్గర అయినా, భర్త భార్య దగ్గర అయినా దాచడం ముమ్మాటికీ తప్పే. ఈ అప్పు ఎలా తీర్చాలనే దానిపై భార్యాభర్త దృష్టి పెట్టాలి. ఆర్థిక భారాన్ని వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
