హై స్పీడ్ రైలుకు బ్రేకులు.. అధికారులు ఓకే.. నేతలు నో!

 హై స్పీడ్ రైలుకు బ్రేకులు.. అధికారులు ఓకే.. నేతలు నో!
  • హై స్పీడ్ రైల్వే కారిడార్ అలైన్‌‌మెంట్‌‌పై తలోదారి
     
  • నెలల నుంచి సర్వేలు చేసి ఖరారు చేశాక కొర్రీలు 
  • గతంలో మెట్రో2 డీపీఆర్, రుణంపై ఇదే లొల్లి
  • రాష్ట్ర ప్రాజెక్టులపై పొలిటికల్ అడ్డుపుల్లలు
  • హైదరాబాద్​ డెవలప్‌‌మెంట్‌‌పై కేంద్రం 
  • శీతకన్ను వేస్తున్నదని రాష్ట్ర సర్కారు అసహనం

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. మొన్నటికి మొన్న  మెట్రో రెండో దశ విస్తరణపై కొర్రీలు పెట్టిన ఢిల్లీ పెద్దలు.. నేడు ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైల్వే కారిడార్ అలైన్‌‌మెంట్‌‌పైనా అదే తరహాలో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రైల్వే శాఖకు చెందిన అత్యున్నత సాంకేతిక సంస్థలు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నెలలనుంచి అణువణువూ గాలించి, టెక్నో-ఎకనామిక్ సాధ్యాసాధ్యాలను బేరీజు వేసి మార్గాలను ఖరారు చేశాక, ఇప్పుడు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి అడ్డుపుల్లలు వేయడం విస్మయం కలిగిస్తున్నది.

అధికారులు ఒక దారి చూపిస్తుంటే, కేంద్ర మంత్రులు మాత్రం అసలు అలైన్‌‌మెంట్లే ఖరారు కాలేదంటూ పూటకో మాట మాట్లాడుతూ తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజాధనంతో నిర్వహించిన సర్వేలు, సాంకేతిక నివేదికలను పక్కనపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అభివృద్ధి విషయంలో ఐక్యంగా ఉండాల్సిన చోట కేంద్రం వరుసగా అడ్డుపుల్లలు వేస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.

కేంద్ర మంత్రుల పొంతనలేని మాటలు..

తెలంగాణ పరిధిలో బుల్లెట్ (హైస్పీడ్) రైళ్ల నెట్‌‌వర్క్ రాష్ట్ర భవిష్యత్తునే మార్చే విధంగా భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటోంది. మొత్తం 3 ప్రధాన మార్గాల్లో రాష్ట్ర పరిధిలోనే 478 కిలోమీటర్ల మేర హైస్పీడ్ ట్రాక్‌‌లు నిర్మించాల్సి ఉందని  నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్–ముంబై–పుణె కారిడార్ రాష్ట్ర పరిధిలో 93 కిలోమీటర్లు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్ అత్యధికంగా 205 కిలోమీటర్లు, అలాగే హైదరాబాద్–చెన్నై కారిడార్ 180 కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగం నుంచి సాగనున్నాయి. ఈ కారిడార్లకు సంబంధించి రైల్వే సాంకేతిక సంస్థ ‘రైట్స్’ నిపుణులు క్షేత్రస్థాయిలో ప్యాసింజర్స్‌‌ డెన్సిటీ, అటవీ భూములు రాకుండా శాస్త్రీయంగా  ప్రాథమిక అలైన్‌‌మెంట్లను ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే, అధికారులు నివేదికలు సమర్పించి డీపీఆర్‌‌లు సిద్ధం చేస్తున్న కీలక తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి..  అసలు అలైన్‌‌మెంట్లు ఖరారు కాలేదంటూ పూటకో మాట మాట్లాడుతూ బ్రేకులు వేయడంతో అంతా ఒక్కసారి అవాక్కయ్యారు.  దీంతో అధికారుల మాటకు.. మంత్రుల ప్రకటనలకు పొంతన లేకపోవడంతో వేల కిలోమీటర్ల ప్రాజెక్టుల భవితవ్యం మళ్లీ అయోమయంలో పడిపోయింది. 

మెట్రో తరహాలోనే నాన్చివేత ధోరణి..

గతంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్–-2 విషయంలోనూ కేంద్ర సర్కారు సరిగ్గా ఇలాంటి నాన్చుడు ధోరణినే ప్రదర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 24వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో విమానాశ్రయం, పాతబస్తీ, ఐటీ కారిడార్లను కలుపుతూ రెండో దశ డీపీఆర్‌‌లను సిద్ధం చేసి కేంద్ర సహకారాన్ని కోరింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, రూట్ మ్యాప్‌‌లను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సాంకేతికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, రుణ మంజూరు ప్రక్రియ తుది దశకు చేరిన వేళ కేంద్ర పెద్దలు ఉన్నట్టుండి బ్రేకులు వేశారు. రైడర్‌‌షిప్ సరిపోదంటూ విచిత్రమైన కొర్రీలు వేస్తూ ఫైళ్లను అటకెక్కించే ప్రయత్నం చేసి.. నెలలకొద్దీ జాప్యానికి కారణమయ్యారు. ఉత్తరాదిలోని చిన్న నగరాలు, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రోలకు వేల కోట్ల రూపాయలను ఉదారంగా మంజూరు చేస్తూ, గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ పట్ల మాత్రం వివక్ష చూపడం కేంద్ర పక్షపాత వైఖరికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అర్బన్ మొబిలిటీని పెంచే ప్రాజెక్టుకు నిధుల సమీకరణలో చేదోడువాదోడుగా నిలవాల్సింది పోయి.. ప్రతి దశలోనూ ఏదో ఒక కొర్రీ పెట్టి అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం చూపుతున్న చిన్నచూపునకు అద్దం పడుతోందని సెక్రటేరియెట్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

 కేంద్రం తీరుతో మరింత జటిలం

ఏదైనా ఒక భారీ రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే అర్బన్ ప్లానర్లు, ఇంజినీరింగ్ నిపుణులు వ్యయ -ప్రయోజన నిష్పత్తి, శాస్త్రీయ మార్గాలను పరిగణనలోకి తీసుకొని నివేదికలు రూపొందిస్తారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లతో ఆయా అలైన్‌‌మెంట్లలో మార్పులు చేయాలని ఒత్తిడి తెస్తే ప్రాజెక్టు వ్యయం అంచనాలకు మించి పెరిగిపోవడమే కాకుండా భూసేకరణ మరింత జటిలమవుతుంది.

సాంకేతిక నిపుణులు రేయింబవళ్లు శ్రమించి టెక్నికల్ మ్యాపింగ్ పూర్తి చేస్తే, కేంద్ర నేతలు పబ్లిక్‌‌గా విరుద్ధ ప్రకటనలు చేయడం వల్ల వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడి పరిపాలనా సంక్షోభం తలెత్తుతోంది. ఈ అనవసర జోక్యం వల్ల క్షేత్రస్థాయి అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినడమే కాకుండా, ప్రాజెక్టు కోసం వెచ్చించిన విలువైన ప్రజాధనం, సమయం పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన అందించకపోతే రాబోయే రోజుల్లో ట్రాఫిక్  మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో మెట్రో,  హైస్పీడ్ కారిడార్లను వేగంగా పరుగులు పెట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌‌కు సంబంధించిన ప్రాజెక్టులపై మాత్రం ఎందుకు పట్టింపులేనట్లు వ్యవహరిస్తోందన్నదనే ప్రశ్నలు వస్తున్నాయి.