ఏపీలో స్థానిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. నామినేషన్లు మొదలైన రోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం పుంగనూరు, రాయచోటి, ధర్మవరం ప్రాంతాల్లో ఘర్షణలు జరగగా.. శనివారం ( అక్టోబర్ 17 ) మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇలాఖా పులివెందులలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. నామినేషన్ వేయడానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు కవ్వించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నామినేషన్ కేంద్రం దగ్గర మోహరించిన వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పులివెందుల నామినేషన్ కేంద్రం రణరంగంగా మారడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.
మొదటి రౌండ్ కాల్పులు జరిపినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. శాంతిభద్రతలు అదుపులో పెట్టాల్సిన పోలీసులు టీడీపీ గుండాలను అడ్డుకోకుండా తమను మాత్రమే అడ్డుకుంటున్నారని..ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
