మనదేశంలో ఒక కొత్త ట్రెండ్ నెమ్మదిగా పెరుగుతోంది. అదే “డబ్బులు ఇచ్చి స్నేహితులను అద్దెకు తీసుకోవడం” (హైర్ – ఎ– ఫ్రెండ్). వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ సిటీ లైఫ్ ఎలా మారిపోయిందో చూస్తే, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది.
పనులు, ప్రెజర్, ట్రాఫిక్, బిజీ షెడ్యూల్స్ మధ్య చాలామందికి మాట్లాడటానికి, కలిసి నడవటానికి లేదా సరదాగా టైం గడపటానికి ఎవరో ఒకరు కావాలి. ఆ అవసరాన్ని తీర్చడానికి ఇప్పుడు “కంపానియన్ సర్వీసులు” అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీస్‌లలో మీరు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మీకు కావాల్సిన వ్యక్తిని ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణకు, మీతో మాట్లాడే ఫ్రెండ్, బ్యాడ్మింటన్ ఆడటానికి పార్ట్నర్, ఉదయం వాకింగ్‌కు తోడు, షాపింగ్‌కు సాయం చేసే వ్యక్తి ఇలా అనేక రకాలుగా సర్వీసులు ఉంటాయి. కొంతమంది వృద్ధులకు ఆసుపత్రికి వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో చిన్న పనులు చేసేటప్పుడు కూడా ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. కొత్తగా సిటీకి వచ్చిన వాళ్లకు వెంటనే పరిచయాలు ఏర్పడటం కష్టం. కాబట్టి అలాంటివాళ్లు ఈ సేవలను ఎక్కువగా వాడుకుంటున్నారు.
ఇది ఫ్రీ సర్వీస్ కాదు. సాధారణంగా గంటకు కొన్ని వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. మీరు ఎలాంటి సర్వీస్ తీసుకుంటున్నారో, ఎంతసేపు అవసరమో అనే దానిపై ధర మారుతుంది. అయినా కూడా చాలామంది ఈ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది.. తోడు, మాట్లాడే మనిషి, కొంచెం మనసుకు హాయిగా అనిపించే సమయం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవి డేటింగ్ లేదా ఎస్కార్ట్ సేవలు కావు. ఈ ప్లాట్ ఫామ్‌లు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, ఇవి కేవలం సామాజిక సహవాసం కోసం మాత్రమే.
ఒంటరితనమే కారణం
పెద్ద సిటీల్లో ఇప్పుడు కుటుంబాలు చిన్నవయ్యాయి. స్నేహితులు దూరమయ్యారు. అందరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. దాంతో మనుషుల మధ్య దూరం పెరిగింది. ఒంటరితనంతో చాలామంది సతమతమవుతున్నారు. ఈ ఖాళీని భర్తీ చేయడానికే ఇలాంటి సేవలు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు లేదా ఒంటరిగా ఉండే వ్యక్తులకు ఇవి కొంతమేరకు సాయపడుతున్నాయి.
అయితే, దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. “స్నేహం కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమైన సంబంధాల విలువ తగ్గిపోతుందేమో అనే ఆందోళన కూడా ఉంది. కానీ మరోవైపు, అవసరంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉండటం కూడా చాలామందికి పెద్ద సాంత్వనగా మారుతోంది.
మొత్తానికి చూస్తే, ఈ “హైర్-–ఎ–-ఫ్రెండ్” కాన్సెప్ట్ మన సమాజంలో మారుతున్న లైఫ్‌స్టైల్‌కి మిర్రర్ ఇమేజ్. మనుషులకి డబ్బు, సౌకర్యాలు పెరిగినా భావోద్వేగ సంబంధాలు మాత్రం తగ్గిపోతున్నాయి. అందుకే ఇప్పుడు స్నేహం కూడా ఒక సేవలా మారుతోంది. ఇది మంచిదా? చెడ్డదా? అనేది పక్కన పెడితే, మనుషులకి ఇంకా మనుషులే అవసరం అని చెప్పకనే చెప్తోంది ఈ ట్రెండ్.
