Interior Design Tips : చిన్న చిన్న టెక్నిక్స్ తో.. మీ ఇంటిని అందంగా మార్చేసుకోండి.. !

Interior Design Tips : చిన్న చిన్న టెక్నిక్స్ తో.. మీ ఇంటిని అందంగా మార్చేసుకోండి.. !

ఇంట్లో ప్రతి గదిని అందంగా తీర్చిదిద్దాలని ఉంటుంది. అలాగని ఇంటీరియర్ డిజైనర్ తో చేయించాలంటే ఖర్చు చాలా అవుతుంది. కానీ అందరికీ అంత డబ్బు ఖర్చు పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వాళ్లు సింపుల్​ గా చిన్నపాటి టెక్నిక్స్ తో  ఇంటికి కొత్తరూపు తీసుకురావచ్చు. అదీ చీప్ అండ్ బెస్ట్​ లో..

గదిని తోచిన విధంగా అలంకరిస్తే ఆకర్షణీయంగా కనిపించకపోగా టైం వేస్ట్ అవుతుంది. అలాకాకుండా. ఇల్లు ఫంక్షనల్ గా అట్రాక్టివ్​గా ఉండాలంటే కాస్త ప్లాన్ చేసుకోవాలి.. మీ ఇల్లు మీరేంటో చెప్తుంది కాబట్టి ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ఫంక్షనల్ లేఅవుట్: ఇంటీరియర్ డిజైనింగ్ ముందుగా గది ఫంక్షనల్ లేఅవుట్ తో ప్రారంభం కావాలి.. ఆన్​ లైన్​ లో  దీనికి సంబంధించిన సూచనలు.. సలహాలు కోసం సెర్చ్ చేయొచ్చు. ఇందులో గది విస్తీర్ణం ఫర్నిచర్ కొలతలను టైప్ చేస్తే డిజైనింగ్ లేఅవుట్ కూడా కనిపిస్తుంది.. కానీ దీన్ని బట్టి డిజైన్ చేసుకునేటప్పుడు కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఆ మార్పులు కూడా పెద్ద పెద్దవేం కాదు.. కాస్త ఫర్నిచర్ ను అటు ఇటు జరపడమే.


హాల్: చిన్న చిన్న అంశాలే హాల్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. చాలామంది నలుపు రంగు ఇష్టపడరు కానీ నలుపురంగుహాల్ కి ప్రత్యేకమైన అందాన్నిస్తుంది. బ్లాక్  వుడెన్​ ఫ్రేమ్స్​..  కర్టెన్స్ పై బ్లాక్ గ్రాఫిక్ ప్రింట్ .. పిల్లోలపై బ్లాక్ లైనింగ్.. ఇలా పలు రకాల డిజైన్లు హాట్లో ట్రై చేయొచ్చు.   అలాగే హాల్ అలంకరణ అనగానే ముందుగా గుర్తొచ్చేది  సోఫానే కదా..!

సోఫా గది లుక్​ ను  ఆకర్షణీయంగా మార్చేస్తుంది. అందుకే సోఫా కొనాలనుకుంటే ఏరంగు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి? ఎంత సైజు ఉండాలి? ఎంత ఖర్చు చేయగలరు? ఎంత క్వాలిటీ ఉండాలి? అనేవి దృష్టిలో ఉంచుకోవాలి. సోఫా తీసుకునే ముందు నాలుగైదు షోరూంలకు వెళ్లి చూడడం మంచిది. అప్పుడే మీ అభిరుచికి అవసరాలకు తగినట్టుగా సోఫాను ఎంచుకోగలుగుతారు. అలాగే సోఫా తీసుకునే ముందు గదిలో ఎంత విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుందో కూడా తెలుసుకొని కొనాలి. ఈరోజుల్లో మల్టీఫుల్ ఫర్నీచర్ ట్రెండ్ నడుస్తోంది. అంటే సోఫానే  బెడ్ లా మారడం కావాలసుకుంటే ఆ ట్రెండ్ ని కూడా ట్రై చేయొచ్చు.

అలంకరణ కోసం: ఇంటి అలంకరణ కోసం ఏ వస్తువులైతే బాగుంటాయో ముందుగానే గమనించాలి. వస్తువుల కొనుగోలు విషయంలో డిజైనర్ల సలహా తీసుకోవచ్చు. మ్యాగజైన్లు తిరగేసేటప్పుడు నచ్చిన డిజైన్ కనిపిస్తే మార్కెటీలో దానికోసం ప్రయత్నించొచ్చు. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ షోరూమ్స్ లో డెకరేటివ్ ఆబ్జెక్ట్ ను హాల్, కిచెన్, బెడ్​ రూం థీమ్స్ తో డిస్ ప్లేలో పెడతారు. వాటిని చూసి కూడా ఇంట్లో వస్తువులను అమర్చుకోవచ్చు.. అలాగే గదిలో కార్పెట్ వేసుకోవడం, లేయర్స్ ఉన్న పిల్లో కవర్స్.. కర్టెన్స్ ఎంచుకోవడం వల్ల గది అలంకరణ భిన్నంగా కనిపిస్తుంది. వెల్వెట్ పిల్లోస్, సిటీ రన్స్, మోహెర్ బ్రాండెట్స్ ఇలా పలురకాల టెక్చర్స్, ఫ్యాక్సీ వంచుకుంటే గది అందం రెట్టింపు అవుతుంది.

గ్రీనరీ స్పెషల్ ఎట్రాక్షన్

డెకరేటివ్​ ఆబ్జెక్ట్స్​ ను ఇంట్లో అందంగా అమర్చినా గ్రీనరి లేకపోతే ఇంటికి లుక్​ రాదు. కాబట్టి గదిలో కొంత గ్రీనరి ఉండేలా చూసుకోవాలి. అంటే గది మూలల్లో మొక్కలు పెట్టుకోవడం.. మధ్యలో ఫ్లవర్​ వాజ్ పెట్టడం చేయవచ్చు. గదిలో ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల పరిసరాలు కూడా ఆహ్లాదంగా మారతాయి. అంతే కాలుష్యం తగ్గుతుంది..

కర్టెన్ల ఎంపిక:ఇంటి అలంకరణలో కర్టెన్లు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కర్టెన్ల  ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫొటోగ్రఫీ ఆర్ట్, డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ కలిసిన కర్టెన్లు ఇంటికి కొత్త అందాన్ని తెస్తాయి. పండ్లు, కూరగాయలు, నగరాలు, రాజభవనాలు. ఎగిరే పక్షులు, పచ్చిక బయళ్లు, సాగర తీరాలు, నెమళ్లు, ఇలా చాలా రకాల్లో కరైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి వాడటం వల్ల ప్రత్యేకంగా గోడలపై ఫొటోలు, ఆర్ట్​ సీన్​ లు  ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవసరం కూడా ఉండదు.

కిచెన్ డెకరేషన్: మారుతున్న అలవాట్లకు అనుగుణంగా కిచెన్ ను  తీర్చుదిద్దుకోవాలి. అందం. ఆకర్షణీయతతో పాటు వంటగది సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటి డిజైన్​ ను బట్టి  కిచెన్​  కోసం కేటాయించిన స్థలాన్ని బట్టి కిచెన్ ని డిజైన్ చేసుకోవాలి. చిన్న చిన్న అపార్ట్ మెంట్స్ లో అయితే 'ఎల్ 'వి', 'యు' ఆకారంలో కిచెన్ డిజైన్ చేసుకోవచ్చు. కప్​ బోర్డులు, డ్రాలతో పాటు గ్లాస్, పింగాణీ పాత్రలు ఉండే అల్మరాలను రంగురంగుల లామినేషన్స్ తో అలంకరిస్తే అందంగా ఉంటుంది. అలాగే మంటలకు తట్టుకునే, నీళ్లు పడినా పాడవని, చెదల సమస్య లేని కిచెన్​ సామాగ్రినే వాడాలి. సిరామిక్, క్రిస్టల్, పీవీపీ, ప్లైవుడ్ సామాగ్రి కిచెన్​ లో  వాడితే అందంగా ఆకర్షణీయంగా ఉంచింది.

బిగ్​లుక్​ :ఇంట్లో గదులు చిన్నగా ఉంటే అలంకరణతో గదికి బిగ్ లుక్ తీసుకురావొచ్చు. కార్పెట్ వాడితే గదికి మరింత అందం వస్తుంది. అదీ స్టెప్స్​ డిజైన్ ఉన్నది వాడితే గది విశాలంగా కనిపిస్తుంది. చిన్న గదిని పెద్దగా కనిపించేలా డిజైన్ చేయడానికి అద్దం బెస్ట్ ఆప్షన్ . ఓ పెద్ద అద్దాన్ని గది గోడకు ఫిట్ చేస్తే, మొత్తం గదిని అది ప్రతిబింబించి ఫ్రెష్ లుక్ తీసుకొస్తుంది. అలాగే కొన్ని ఇళ్లకు సీలింగ్ తక్కువ ఎత్తులో ఉంటుంది. అలాంటప్పుడు గదుల్ని తక్కువు ఫర్నీచర్తో అలంకరించాలి. అలాగే సీలింగ్ కి మంచి రంగు వేస్తే గదులు కళకళలాడతాయి. అలాగే గదిలో ఎంత ఖరీదైన లైటింగ్ వాడినా. ఉదయం సహజంగా వచ్చే లైటింగ్ వచ్చేలా కరైన్లను ఎంచుకోవాలి...

–వెలుగు,లైఫ్​–