- ప్రతీకారం తీర్చుకుంటామన్న యెమెన్ ప్రభుత్వం
సనా/షాబ్వా/కైరో: యెమెన్‌లో అంతర్యుద్ధం మళ్లీ భీకరరూపం దాల్చింది. దక్షిణ యెమెన్‌లోని షాబ్వా గవర్నరేట్‌లోని అల్ -అలామ్ సైనిక శిబిరంపై హౌతీ రెబల్స్ తాజాగా క్షిపణి దాడి చేశారు. దీంతో 53 మంది సైనికులు మరణించారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సైనిక శిబిరంలో కొత్త సెక్యూరిటీ రిక్రూట్లకు శిక్షణ ఇస్తుండగా, హౌతీ ఉగ్రవాదులు 3 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డారు.
ప్రారంభంలో ఈ దాడిలో 18 మంది మృతి చెందినట్లు, 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరికొంత మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 53కి చేరినట్లు షాబ్వా స్థానిక యంత్రాంగం వెల్లడించింది.
యెమెన్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఆగ్రహం
యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్ షిప్ కౌన్సిల్ చీఫ్ రషాద్ అల్ -అలిమి ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. కొత్త రిక్రూట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం హౌతీల దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని అన్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు హౌతీలు ఇలా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, దీనికి ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు.
