అంత‌కు మించి విల్లు ప‌ట్టాల్సిందే..!

అంత‌కు మించి విల్లు ప‌ట్టాల్సిందే..!

ఆమధ్య ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్ లుక్ ఆలస్యమైందని అసంతృప్తికి లోనైన అభిమానుల్ని వరుస సర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌తో ఖుషీ చేశాడు ప్రభాస్. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌‌‌తో పాటు రెండు భారీ సినిమాలను అనౌన్స్ చేసి మరీ సంతోష పెట్టాడు. అందులో మొదటిది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ. మరొకటి రామాయణం బ్యాక్‌డ్రాప్‌‌‌‌లో ఓమ్‌ రౌత్ తీయనున్న ‘ఆదిపురుష్‌’. ఈ రెండు సినిమాలూ అంచనాలను మించి ఉండబోతున్నాయని ఆయా టీమ్స్ చెబుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ ఎలా  కనిపించనున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఆదిపురుష్‌’లో మాత్రం రాముడిగా కనిపిస్తాడనేది రివీల్ అయింది. శివ ధనుస్సును విరిచి సీతను పెళ్లాడటం మొదలు రావణాది రాక్షస సంహారం వరకూ రాముడి విలువిద్యా ప్రావీణ్యత అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ విలువిద్యలో శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అయితే విల్లు పట్టడం ప్రభాస్‌కి కొత్తేమీ కాదు.

‘బిల్లా’లోని ఓ సీన్‌లో బాణం ఎక్కుపెట్టిన ప్రభాస్, ‘బాహుబలి’ కోసం విలువిద్యతో పాటు ఇతరత్రా యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగని ఇందుకోసం ఏ విదేశాలకో వెళ్లడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి.. ఇంటి దగ్గరే ట్రైనర్‌‌‌‌ని పెట్టుకుని ప్రాక్టీస్ చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెకెండాఫ్‌లో ఈ సినిమా సెట్స్‌‌‌‌కి వెళ్లనుంది. ఈలోపు ప్రభాస్ ట్రైనింగ్‌‌‌‌తో పాటు పాత్రకి తగ్గ ఫిట్‌‌‌‌నెస్‌పై కూడా దృష్టి పెట్టనున్నాడు. ‘బాహుబలి 2’లో ప్రభాస్ ఒకేసారి మూడు బాణాలు సంధించిన సీన్ హైలైట్ అయ్యింది. ‘ఆదిపురుష్‌’లో ఇలాంటి స్పెషల్ ఫైట్స్ ఎన్ని ఉంటాయో.