మీ భర్త వయసు 34 నుంచి 35 ఏండ్లా.. పిల్లలు పుట్టడం లేదా..? అయితే మెయిన్ రీజన్ ఇదే..!

మీ భర్త వయసు 34 నుంచి 35 ఏండ్లా.. పిల్లలు పుట్టడం లేదా..? అయితే మెయిన్ రీజన్ ఇదే..!

ఈరోజుల్లో చాలా జంటలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంతాన లేమి. పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు.. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని ప్రసిద్ధ గర్భగుడి ఐవీఎఫ్ సెంటర్ వేదికగా మన రాష్ట్ర డాక్టర్లు నిర్వహించిన అధ్యయనంలో ధూమపానం వల్ల వీర్య కణాల నాణ్యత ఏ విధంగా పడిపోతుందో వెల్లడించారు.

నల్గొండ గవర్నమెంట్ మెడికల్  కాలేజీకి చెందిన డాక్టర్ అమేరా అఫ్రోజ్, ఖమ్మం మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ డి. చండిప్రియ, సూర్యాపేట మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సీ. లావణ్య సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు. వీరు ఐవీఎఫ్ సెంటర్‌‌లోని క్లినికల్ ఎంబ్రియాలజీ విభాగంలో అందుబాటులో ఉన్న రికార్డులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. సంతానలేమితో బాధపడుతున్న పురుషులలో సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ క్లినికల్ స్టడీ స్పష్టం చేసింది.

ఈ పరిశోధన కోసం ఐవీఎఫ్ సెంటర్కు వచ్చిన 300 మంది పురుషులను నిపుణులు పరిశీలించారు. వీరిలో 150 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు కాగా, మిగిలిన 150 మంది ఆ అలవాటు లేనివారు. వీరి సగటు వయస్సు 34 నుంచి 35 ఏండ్లు. పరీక్షల అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం.. సిగరెట్ తాగే వారిలోనూ, తాగని వారిలోనూ వీర్య కణాల సంఖ్య, కదలిక, వీర్యం పరిమాణం దాదాపు ఒకేలా ఉన్నట్టు కనిపించింది.

సిగరెట్ తాగే వారిలో కణాల సాంద్రత 51.7 మిలియన్లు ఉంటే, తాగని వారిలో 55.9 మిలియన్లుగా ఉంది. అయితే, ఈ తేడా పెద్దగా ప్రభావం చూపేది కాకపోయినప్పటికీ, కణాల అంతర్గత నాణ్యతలో మాత్రం భారీ తేడాలు కనిపించాయి. ముఖ్యంగా వీర్యంలోని పీహెచ్​ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల కణాలు జీవించే సామర్థ్యం తగ్గుతున్నట్టు గుర్తించారు.