మీ ఇంట్లో మల్లెచెట్టు పూలు పూయడం లేదా.. ఇలా చేస్తే ఏడాది మొత్తం పూస్తూనే ఉంటుంది...

మీ ఇంట్లో మల్లెచెట్టు పూలు పూయడం లేదా.. ఇలా చేస్తే ఏడాది మొత్తం పూస్తూనే ఉంటుంది...

మల్లెపూల సువాసన అంటే ఇష్టపడని వారుండరు. మన ఇంటి బాల్కనీలోనో లేదా వాకిట్లో మల్లె మొక్క ఉంటే ఆ ప్రదేశమంత  ఎంతో ప్రశాంతంగా, సువాసనతో  నిండిపోతుంది. అయితే చాలామంది మల్లె మొక్క తెచ్చిన కొత్తలో బాగానే పూస్తుంది కానీ, తర్వాత పూలు పూయడం ఆగిపోయిందని. నిజానికి మల్లె మొక్క సరిగ్గా పెరగాలంటే వాతావరణం కంటే మీరు చూసుకునే విధానమే ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వేడికి మల్లె మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో కూడా ఏడాది పొడవునా మల్లెలు వికసిస్తాయి.

మల్లెపువ్వు మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. కానీ మన వాతావరణానికి, ముఖ్యంగా కుండీల్లో పెంచడానికి 'మొగ్రా'(Mogra)రకం చాలా మంచిది. ఇది ఎండను, తేమను తట్టుకుని ఏడాదంతా పూలు పూస్తుంది. నర్సరీ నుండి మొక్కను తెచ్చేటప్పుడు ఆకులు పచ్చగా, బలంగా ఉన్న మొక్కను తీసుకోండి.

 ఎండ తగిలే చోట  
మల్లె మొక్కకు ఎండ చాలా ముఖ్యం. ఎండ సరిగ్గా తగలకపోతే కేవలం ఆకులు మాత్రమే పెరుగుతాయి, పూలు పూయవు. రోజుకు కనీసం 4 నుండి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట మొక్కను ఉంచండి. ముఖ్యంగా ఉదయం పూట ఎండ తగిలితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

 నీరు ఇంకా  మట్టి 
మల్లెపువ్వుల మొక్కకు మట్టి ఎప్పుడూ బురదలా ఉండకూడదు. తోట మట్టిలో కొంచెం ఇసుక, పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలిపి కుండీ నింపుకోండి. దీనివల్ల నీరు నిలవకుండా కిందకు పోతుంది. కుండీలో పైన ఉన్న మట్టి పొర ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయండి. ఎక్కువగా నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయి ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి.

 కొమ్మలు కత్తిరించడం
మల్లెమొక్కకు పాత కొమ్మల కంటే కొత్తగా వచ్చే లేత కొమ్మల మీదనే పూలు ఎక్కువగా పూస్తాయి. పూలు పూయడం అయిపోయిన తర్వాత ఆ కొమ్మ చివరలను కొంచెం కత్తిరించండి. ఎండిపోయిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు తీసేయండి. ఇలా చేయడం వల్ల మొక్కకు శక్తి వచ్చి కొత్త చిగుళ్లు వేస్తుంది, ఇలా ఎక్కువ పూలు పుస్తాయి.

సహజమైన ఎరువులు 
మొక్కకు బలం ఉంటేనే పూలు పూస్తుంది. నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లేదా బాగా మగ్గిన పశువుల ఎరువు వేయండి. ఇంట్లో వాడేసిన టీ పొడి లేదా అరటిపండు తొక్కల ఎరువు కూడా మల్లెచెట్టుకు చాలా మంచిది. ఆకుల వెనుక తెల్ల దోమలు లేదా చిన్న పురుగులు కనిపిస్తే, లీటరు నీటిలో కొంచెం వేప నూనె కలిపి పిచికారీ చేయండి. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మల్లెచెట్టు పెంపకంలో సరైన ఎండ, నీరు, అప్పుడప్పుడు కొమ్మల కత్తిరింపులు చేస్తే, మీ మల్లె మొక్క ఏడాదంతా మల్లె పువ్వులతో సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది.